పోలింగ్ ఏజెంట్లు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి
వైఎస్సార్‌సీపీ నాయకులకు మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
ప్రతి అంశంపైపక్కా సాక్ష్యాధారాలు ఉండేలా చూడాలి
అప్పుడే ఈ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోగలం
ఎన్నికలను సజావుగా నిర్వహిస్తారన్న నమ్మకం లేదు
పోలీసులు, ఆర్వోలు చంద్రబాబు కనుసైగల్లో పనిచేస్తున్నారు
నామినేషన్ల సమయంలో ఎన్నో దారుణాలు చేసిన చంద్రబాబు పోలింగ్ సమయంలో రిగ్గింగ్‌కు కూడా వెనుకాడరు
దీటుగా ఎదుర్కొనేలా పోలింగ్ ఏజెంట్లను సన్నద్ధం చేయాలి
చివరకు బ్యాలెట్ బాక్సుల రూములనూ చంద్రబాబు ఏదైనా చేయవచ్చు
సుప్రీంకోర్టు చెప్పినా, మనం ఎన్నిసార్లు కోరినా.. సీసీ కెమెరాలు పెట్టడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ మాత్రం చొరవ చూపడం లేదు
కాబట్టి ప్రతి అడుగులో మరింత జాగ్రత్త అవసరం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజున మరింత అప్రమత్తం అవసరమని... పోలింగ్ ఏజెంట్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రతి అంశంపై పక్కా సాక్ష్యాధారాలు ఉండేలా చూడాలని.. అప్పుడే ఈ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోగలమని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. నామినేషన్ల పర్వంలోనే యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారని గుర్తు చేశారు.
ఈ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తారన్న నమ్మకం లేదని, పోలింగ్ రోజు మరిన్ని అరాచకాలకు అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రతి అడుగులో మరింత జాగ్రత్త అవసరమని.. మనమంతా చంద్రబాబు లాంటి రాక్షసుడితో పోరాడుతున్నామన్న విషయం మరవొద్దని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..

ఎప్పుడూ చూడని దారుణాలు ఇప్పుడు చూస్తున్నాం..
స్థానిక ఎన్నికలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబరు 1న మున్సిపల్ ఎన్నికలు, 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని దారుణాలు ఇప్పుడు చూశాం. నిజానికి దేశంలో కూడా ఎక్కడా ఈ స్థాయిలో అరాచకాలు జరిగి ఉండకపోవచ్చు. ఏకంగా నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం... ఆ దశలోనే రిగ్గింగ్ చేయడం... అభ్యర్థులపై దాడులు... నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేయడం... పోలీసుల సమక్షంలోనే దాడులతో సహా అన్నీ!
చివరకు ఆర్‌ఓలు కూడా అచ్చం పార్టీ నాయకుల్లా పని చేయడం... వారే సర్టిఫికెట్లు చింపేసి, నామినేషన్లు తిరస్కరించడం. కొన్నిచోట్ల ఫోర్జరీ సంతకాలు చేసి, నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చెప్పడం. ఇంకా కొన్నిచోట్ల ఏకంగా బీ–ఫామ్స్ కూడా చింపేశారు. ఇక అధికార పార్టీ వాళ్లు కొన్నిచోట్ల ఓసీలకు బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి పోటీలో నిలిపారు. ఇంత దౌర్భాగ్యంగా ఏ ఎన్నికల్లోనూ, దేశంలో ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఇన్నిన్ని అరాచకాలు, దౌర్జన్యాలు చేసి మళ్లీ నిస్సిగ్గుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అందుకే ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
నామినేషన్ ఒక హక్కు.. ఓటు మరో హక్కు
ఎన్నికల్లో నామినేషన్ల పర్వం.. ఆ తర్వాత పోలింగ్ రెండూ ముఖ్యం. నామినేషన్ ఒక హక్కు అయితే, ఓటు మరో హక్కు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ, ఆ పార్టీకి నిత్యం జాకీలు పెట్టి ఎత్తే ఎల్లో మీడియా ఒక మాఫియాలా మారాయి. ఇష్టానుసారం దౌర్జన్యాలు. అరాచకాలు చేస్తున్నారు. ఇప్పటికే భూములు నిషేధిత జాబితా 22–ఏలో పెట్టి లాక్కుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు ఆస్తుల పేపర్లు కూడా లాక్కుని, అవి తమవే అని చెప్పుకుంటారు. కాబట్టి అంతా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
పోలింగ్ ఏజెంట్లు మరింత అప్రమత్తం..
చంద్రబాబు పోలీసులను స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసులు, మొత్తం వ్యవస్థ చంద్రబాబు నియంత్రణలో ఉంటున్నాయి. కాబట్టి, నవంబరు 1న జరిగే మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత 5న జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలి. పోలింగ్ బూత్‌ల్లో కూర్చునే ఏజెంట్లు కచ్చితంగా ప్రతి ఓటును ప్రశ్నించాలి. ఎక్కడ సందేహం ఉన్నా.. ఎలా స్పందించాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? అనేది తెలుసుకోండి. వీలుంటే ప్రతిదీ వీడియో తీయాలి. ప్రతి అంశానికి పక్కా ఆధారాలు ఉండేలా చూడాలి.
పోలింగ్ రోజు అరాచకాలకు అవకాశం కాబట్టి ప్రతి దానిపై పక్కా ఆధారాలుండాలి
నామినేషన్ల పర్వంలోనే ఇన్ని అరాచకాలు చేసిన చంద్రబాబు రేపు పోలింగ్ రోజు ఇంకా ఎక్కువ అరాచకాలు చేయొచ్చు. చివరకు బ్యాలెట్ బాక్సుల రూమ్‌లనూ ఏదైనా చేయొచ్చు. అందుకే పోలింగ్ బూత్‌ల్లోకి ఏజెంట్లను పంపకపోతే ఎలా ఎదుర్కోవాలి? అనేది తెలుసుకోండి. ప్రతిదీ వీడియో తీయండి. మీరు అక్కడికి పోయే ముందే ఆ ఎంట్రీ లెటర్‌ను వీడియో తీయాలి. ఎందుకంటే.. మీరు అక్కడికి పోయే దోవలో మొన్న నామినేషన్ల మాదిరిగా, వాటిని కూడా లాక్కుని చింపే అవకాశం ఉంది. ఎక్కడ, ఏ అన్యాయం, అరాచకం జరిగినా వీడియో ఆధారాలు చాలా ముఖ్యం. సుప్రీంకోర్టు చెప్పినా, మనం ఎన్నిసార్లు కోరినా.. సీసీ కెమెరాలు పెట్టడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏ మాత్రం చొరవ చూపడం లేదు. కాబట్టి, మనం అప్రమత్తంగా ఉండాలి.
పార్టీ నేతల మధ్య సమన్వయం ఇలా..
పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతిరోజూ రెండుసార్లు అసెంబ్లీ కో–ఆర్డినేటర్లతో మాట్లాడాలి. అలాగే ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయంతో టచ్‌లో ఉండాలి. అవసరం అయితే లీగల్ సెల్ సహాయం తీసుకోవాలి. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పూర్తి సమన్వయంతో పని చేయాలి. ఎందుకంటే నామినేషన్ల పర్వంలోనే ఎన్నో అరాచకాలు చేశారు. రేపు అవి ఇంకా కొనసాగుతాయి. కాబట్టి, ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌లు సిద్ధంగా ఉండాలి.
ఈ ఎన్నికల్లో వీరే పార్టీ దళపతులు..
ఈ స్థానిక ఎన్నికల్లో పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు దళపతులు. వారు అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో మమేకమై పని చేసుకోవాలి. ఎందుకంటే.. చంద్రబాబు లాంటి ఒక రాక్షసుడితో మనం యుద్దం చేస్తున్నాం. ఇది ఏ మాత్రం ఫెయిర్‌గా ఉండదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిది రికార్డు చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకు పక్కాగా సాక్ష్యాలు, ఆధారాలు ఉంటాయి. నామినేషన్ల పర్వంలో ఉన్న సాక్ష్యాధారాలు ఇప్పుడు కూడా అవసరమైతే వినియోగించాలి. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిదీ బుల్డోజ్ చేస్తుంది. కాబట్టి చాలా అలర్ట్‌గా ఉండండి. మీరు మీ జిల్లాల్లో చేసే ఫిర్యాదులన్నీ ఇక్కడికి కూడా పంపండి. ఇక్కడి నాయకులు వాటిని ఎస్‌ఈసీకి కూడా ఇస్తారు. ఇలా ప్రతి చోటా అప్రమత్తంగా ఉండి పని చేయాల్సిన అవసరం ఉంది.
హాజరైన పార్టీ నేతలు..
పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావు తదితరులు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి హాజరు కాగా.. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, కురసాల కన్నబాబు. గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు. ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో పాటు పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


