స్థానిక పోరులో ఓటర్ల 'డేటా' చోరీ | TDP has the voter data of all urban local bodies in the state | Sakshi
Sakshi News home page

స్థానిక పోరులో ఓటర్ల 'డేటా' చోరీ

Oct 30 2026 5:10 AM | Updated on Oct 30 2026 5:11 AM

TDP has the voter data of all urban local bodies in the state

ప్రజల వ్యక్తిగత వివరాలు టీడీపీ గుప్పిట్లో

పార్టీ వెబ్‌సైట్‌లో ఇంటింటి వివరాలు, ఫోన్‌ నంబర్లు 

సహాయం ముసుగులో ఓటర్ల డేటా అక్రమ వినియోగం

విజయవాడలో 8 లక్షల మంది ఓటర్ల సమాచారం బహిరంగం

టీడీపీ చేతిలో రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల ఓటర్ల డేటా 

ఎస్‌ఐఆర్‌ ఫారాలు మైటీడీపీ యాప్‌లోకి

పార్టీ గుర్తులతో అనధికార స్లిప్‌లు

గతంలో సేవామిత్ర, వీయాప్‌.. ఇప్పుడు వోటర్స్‌ హెల్ప్‌ 

సైబర్‌ మోసాలు, బెదిరింపులు, దొంగ ఓట్లకు దారి

మహిళల వయసు, ఇంటి చిరునామా, ఫోన్‌ నంబర్లు ఎవరి చేతికైనా వెళ్లే అవకాశం

అధికారంలో ఉన్న ప్రతిసారీ చంద్రబాబు ఇదే దందా

సాక్షి, అమరావతి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల దశలో దౌర్జన్యాలు, అరాచకాలతో ప్రత్యర్థులను కట్టడి చేయాలని చూసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఓటర్లను గుప్పిట్లో పెట్టుకోవడానికి బరితెగించింది. ఏ ఇంట్లో ఎవరున్నారు, మహిళల వయసు, ఫోన్‌ నంబర్‌ వంటి ఓటర్ల డేటా కూటమి ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో దర్శనమిస్తోంది. విజయవాడలోని 8 లక్షలమంది ఓటర్ల జాతకాలు  votershelp.in లో పొందుపరిచారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థాని­క సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీసీటీ స్థానాల పరిధిలోని ఓటర్ల డేటా మొత్తం ఇప్పుడు కూటమి కొత్త వెబ్‌సైట్‌లో బహిర్గతమైంది. 

ఈ వివరాలతో కూటమి నేతలు పార్టీ గుర్తులతో అనధికారికంగా ఓటరు స్లిప్‌లు పంచుతూ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎస్‌ఐఆర్‌ ఫారాలు ఇప్పటికే టీడీపీ యాప్‌లోకి చేరగా, ఇప్పుడు ఓటర్ల ఫోన్‌ నంబర్లు పార్టీ ఎన్నికల వెబ్‌సైట్‌   votershelp.in లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. 2019లో సేవామిత్ర, 2024లో వీయాప్, ఇప్పుడు వోటర్స్‌ హెల్ప్‌.. ప్రజల డేటాను పార్టీ ఆస్తిగా మార్చుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. నవంబర్‌ ఒకటిన 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్‌ జరగనున్న వేళ ఈ డేటా దందా బయటపడింది.

ప్రభుత్వ పోర్టల్‌లా భ్రమ: ఈ వెబ్‌సైట్‌ పైభాగంలో ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్‌ 1950, కింద రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించిన జాబితా అని ఉంది. చూసినవారెవరైనా ప్రభు­త్వ పోర్టల్‌ అనుకుంటారు. కానీ లోగోలో టీడీపీ, జనసే­న, బీజేపీ. హోమ్‌ పేజీలో చంద్రబాబు, మోదీ, పవన్‌కళ్యాణ్‌ ఫొటో­లు, కూటమి మేయర్‌ అభ్యర్థి వంగవీటి రాధా, 86 వార్డు­ల అభ్యర్థుల ఫొటోలు, గుర్తులు ఉన్నా­యి. ఓటరు ప్రభుత్వ సైట్‌ అనుకుని వివరాలు వెతుకుతుంటే ఆ సమా­చారం టీడీపీకి చేరిపోతోంది. అన్ని జిల్లాల్లోను ఇవే తరహా పోర్టల్స్‌ తయారు చేసి కార్యకర్తల ద్వారా నిర్వహిస్తున్నారు. 

ఫోన్‌ నంబర్లతో సహా ఇంటింటి జాతకం..: సైట్‌లో విజయ­వాడ నగరపాలక సంస్థ పరిధిలోని 8,05,797 మంది ఓటర్లు, 848 పోలింగ్‌ కేంద్రాల సమాచారం ఉంది. గురు­వారం సాయంత్రానికే 6.49 లక్షలకు పైగా సెర్చ్‌లు జరి­గాయి. పేరు, ఓటరు ఐడీ లేదా ఇంటి నంబరు కొడితే వార్డు, క్రమసంఖ్య, వయసు, పోలింగ్‌ కేంద్రం, క్యూఆర్‌ కోడ్‌ వస్తున్నాయి. ఆ ఇంట్లోని ఇతర ఓటర్ల పేర్లు, వయసు, తండ్రి లేదా భర్త పేర్లు ప్రత్యక్షమవుతున్నాయి. పీడీఎఫ్‌ రూపంలోని ఓటర్ల జాబితాను డేటాబేస్‌గా మార్చి, ఇళ్ల వారీగా విడదీసి, మున్సిపల్‌–అసెంబ్లీ జాబితాలను అను­సంధానించి ఫోన్‌ నంబర్లు జతచేశారు. అసలు విషయం ‘వాట్సాప్‌లో పంపండి’ బటన్‌లో ఉంది. నొక్కితే నేరుగా ఆ ఓటరు నంబర్‌కే వాట్సాప్‌ చాట్‌ తెరుచుకుంటోంది. ఎన్ని­కల సంఘం జాబితాలో ఫోన్‌ నంబర్లు ఉండవు. పార్టీలకు ఇవ్వదు. మరి ఈ నంబర్లు కూటమి సైట్‌కు ఎక్కడి నుంచి వచ్చాయి? 

ఎస్‌ఐఆర్‌తోనే పునాది: ఈ దందాకు పునాది జూలైలో జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) సమయంలోనే పడింది. బీఎల్‌వోలు సేకరించిన ఎన్యూమ­రేషన్‌ ఫారాలను ప్రైవేట్‌ వ్యక్తులు మైటీడీపీ యాప్‌లోకి ఎక్కించారని వైఎస్సార్‌సీపీ అప్పుడే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటరు ఫొటో, కుటుంబ వివరాలు, ఫోన్‌ నంబరు ఉండే ఆ అధికారిక రికార్డు టీడీపీకి చేరిపోయింది. ఆ డేటాతోనే ఈ వెబ్‌సైట్‌ను తయారు చేశారు.

నిర్వాహకులెవరో రహస్యం 
డొమైన్‌ వివరాల ప్రకారం ఈ సైట్‌ అక్టోబర్‌ 19న.. నామినేషన్ల గడువు ముగిసిన మరుసటి రోజు తెలంగాణలో రిజిస్టర్‌ అయింది. ఓనర్‌ పేరు, ఫోన్, ఈ–మెయిల్‌ దాచేశారు. సర్వర్‌ ఎక్కడుందో తెలియకుండా క్లౌడ్‌ఫ్లేర్‌ ముసుగు వేశారు. నిర్వాహకుడి పేరు, ప్రైవసీ పాలసీ లేవు. ఉన్నది ఒక్క అడ్మిన్‌ లింక్‌ మాత్రమే. అక్టోబర్‌ 25–27 మధ్య అభ్యర్థుల ఫొటోలు అప్‌లోడ్‌ చేశారు. అంటే కోడ్‌ అమల్లో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా దీన్ని తయారు చేశారు. తప్పు చేయకపోతే పేరు దాచాల్సిన అవసరమేంటి? 

బూత్‌ దందా.. భద్రతకే ముప్పు 
ఈ వెబ్‌సైట్‌ ఓటర్ల సహాయం కోసం కాదు.. టీడీపీ నేతలు, ఏజెంట్ల బూత్‌ నిర్వహణ కోసమని స్పష్టమ­వుతోంది. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు, ఎవరి నంబర్‌ ఏంటో తెలిస్తే ఓటరు­ను నేరుగా ప్రలోభ­పెట్టొచ్చు, ఒత్తిడి చేయవచ్చు. ప్రత్యర్థి సానుభూ­తిపరులను గుర్తిం­చడం, పోలింగ్‌ రోజు ఎవరు ఓటేశారో ట్రాక్‌ చేయడం, తమవారిని బూత్‌కు తరలించడం సులభమవు­తుంది. ఇది ఓటరును గుప్పిట్లో పెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని తెలుస్తోంది. 

నిబంధనల ఉల్లంఘన 
ప్రతి ఓటరుకు ఇస్తున్న డిజిటల్‌ స్లిప్‌ కింద వార్డు అభ్యర్థి, మేయర్‌ అభ్యర్థి ఫొటోలు, పార్టీ గుర్తు ముద్రించారు. వాటితో ప్రచారాన్ని ఇంటింటికీ, వాట్సాప్‌ గ్రూపులకు పంపిస్తున్నారు. అనధికారిక స్లిప్‌­లపై అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉండకూడదని కేంద్ర ఎన్నికల సంఘం దశాబ్దాల కిందటే నిర్దేశించింది. స్లిప్‌పై ‘అనధికారిక స­మా­చార స్లిప్‌’ అని వాళ్లే రాసుకుని గుర్తులు, నినాదం ముద్రించారు. 

ఈ డేటా చోరీతో మహిళల భద్రత ప్రశ్నార్థకం 
ఎవరైనా ఏ ఇంటినైనా వెతికి అక్కడ మహిళల వయసు, ఒంటరి వృద్ధులు, ఆడపిల్లలు ఉన్నారా వంటి వివరాలు క్షణాల్లో తెలుసు­కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేధింపులు, వెంబడింపులకు ఇది తలుపులు తెరిచినట్లేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరు, చిరునామా, ఓటరు ఐడీ, ఫోన్‌ నంబర్‌ ఒకేచోట దొరకడం సైబర్‌ నేరగాళ్లకు బంగారు గని. ఓటు వేయనివారి వివరాలు, క్యూఆర్‌ కోడ్‌ ఒక్క స్లిప్‌లో దొరికితే దొంగ ఓట్లకూ ఆస్కారం ఉంటుంది. ఎన్నికల సంఘం పేరుతో పార్టీ సైట్‌ను ప్రభుత్వసేవగా భ్రమింపజేయడం ఓటర్లను మోసం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

పేర్లు మారుతున్నాయి.. దందా అదే.. 
2019 ఎన్నికల ముందు టీడీపీ యాప్‌ సేవామిత్ర వ్యవహారం రెండు రాష్ట్రాలను కుదిపేసింది. యాప్‌ తయారుచేసిన హైదరాబాద్‌ సంస్థ ఐటీ గ్రిడ్స్‌పై తెలంగాణ పోలీసులు డేటా చోరీ కేసు నమోదు చేసి, ఏపీ ఓటర్ల డేటా ఉన్న హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఓటర్ల జాబితాలో పేర్లు ఇష్టానుసారం చేర్చడం, తొలగించడం చేశారు. ప్రజాధనంతో చేసిన ప్రజా సాధికార సర్వే డేటా, ఫైబర్‌గ్రిడ్, ఆర్టీజీఎస్, 1100 కాల్‌ సెంటర్‌ డేటా పార్టీ యాప్‌కు చేరిందని, విదేశీ అమెజాన్‌ సర్వర్లలో నిల్వచేశారని ఆరోపణలు వచ్చాయి. 

2024లో వీయాప్‌ ద్వారా ఓటర్ల కులం, రాజకీయ మొగ్గుతో సహా వివరాలు సేకరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 2026 ఎస్‌ఐఆర్‌లో మైటీడీపీ, ఇప్పుడు వోటర్స్‌ హెల్ప్‌. అప్పుడు హైదరాబాద్‌ సంస్థ, విదేశీ సర్వర్లు. ఇప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్, క్లౌడ్‌ఫ్లేర్‌ ముసుగు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అధికారంలో ఉన్నారు. సంక్షేమ పథకాలు, సచివాలయ సర్వేలు, ఆధార్‌ అనుసంధానంతో ప్రతి కుటుంబం వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. 

అదే ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఎన్నికల వెబ్‌సైట్లలో ఓటర్ల ఫోన్‌ నంబర్లు కనిపిస్తున్నాయి. 2019లో చేసిన తప్పునే మళ్లీ చేస్తూ చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సమాచారాన్ని పార్టీ ఆస్తిగా మార్చుకున్నారు. పోలింగ్‌కు ముందే ఈ వెబ్‌సైట్లను నిలిపేసి, నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని, డేటా ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలని నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement