శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ప్రవేశంపై వివాదం నెలకొంది. ఆలయంలోకి అనుమతించే ముందు వారి లింగ గుర్తింపును ధ్రువీకరించే వైద్య లేదా అధికారిక పత్రాలు తప్పనిసరిగా ఉండాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్ మహిళ సత్యశ్రీ షర్మిలా రెహెమథాలి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. నిర్ణీత ఆచారాలను పాటిస్తూ శబరిమల యాత్ర చేపట్టేందుకు ట్రాన్స్‌జెండర్లకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. అయితే, ఈ విషయంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) వైఖరికే తాము మద్దతు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
పిటిషనర్ లింగ గుర్తింపును నిర్ధారించే అధికారం తమకు లేదని దేవస్వం బోర్డు పేర్కొంది. సంబంధిత వైద్య సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాతే దర్శనానికి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అలాగే, సరైన నిర్ధారణ లేకుండా ప్రవేశం కల్పిస్తే ఆలయ ఆచారాలు, సంప్రదాయాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
ప్రభుత్వ వివరాల ప్రకారం.. పిటిషనర్ ఈ ఏడాది జనవరి 3, ఏప్రిల్ 15 తేదీల్లో శబరిమలను సందర్శించారు. అయితే, ఆగస్టు 20న సన్నిధానం వైపు వెళ్తుండగా పంబ గణపతి ఆలయం సమీపంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం దర్శనానికి అనుమతి కోరుతూ ఆగస్టు 26న ఉన్నతాధికారులకు, దేవస్వం బోర్డుకు వినతిపత్రాలు సమర్పించారు. తమిళనాడు అధికారుల నుంచి తగిన ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని బోర్డు సూచించింది.
ఇదిలా ఉండగా, శబరిమల ప్రవేశ నియమాలు, మతపరమైన ఆచారాలకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుత సంప్రదాయాలనే కొనసాగించాలని పేర్కొంది. పిటిషనర్ కోరిన విధంగా అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆమె పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: 50 ఏళ్లుగా ఆలయ సేవలు.. వల్లియమ్మ మృతితో విషాదం!


