చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. కానీ తన ఆత్మస్ఠయిర్యాన్ని మాత్రం కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలకు శారీరక వైకల్యం అడ్డుకాదని, పైగి ఎదగాలనే కోరిక బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడాయన. రాజస్థాన్‌లోని దౌసాకు చెందిన రాజ్‌వీర్ గుర్జర్ రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) 2024 పరీక్షలో విజయం సాధించి రాష్ట్ర పరిపాలనా విభాగంలో చోటు దక్కించుకున్నారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) విజయ వంతమైన అభ్యర్థులకు ఉద్యోగాలను కేటాయించే ప్రక్రియను ప్రారంభించగా, ఆయనకు 'తహసీల్దార్' పదవి లభించింది.ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత దివ్యాంగులకు, కష్టపడే పిల్లలకు అన్ని విధాలా అండగా నిలుస్తానని చెబుతున్న రాజ్‌వీర్ ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీ గురించి తెలుసుకుందాం ఈ కథనంలో..
ఇదీ చదవండి: బాల్కనీ నుంచి పడిపోతున్న చిన్నారిని ఎలా పట్టుకున్నాడో చూడండి!
రాజస్థాన్‌లోని దౌసా (Dausa) ప్రాంతానికి చెందిన రాజ్‌వీర్ గుర్జార్ (Rajveer Gurjar).. చిన్నతనంలో జరిగిన ఊహించని ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు. రాజ్‌వీర్‌కు పదేళ్ల వయస్సప్పుడు, ఇంటి బయట దొరికిన ఒక వస్తువును బొమ్మ అనుకుని లోపలికి తీసుకొచ్చాడు. దానితో ఆడుతుండగా ఆ వస్తువు పేలడంతో ఆయన రెండు చేతులను కోల్పోవలసి వచ్చింది. కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఈ అంగవైకల్యం ఆయన చదువుకు అడ్డంకి కాలేదు. తన రెండు ముంజేతుల మధ్య పెన్నును పట్టుకుని రాయడం నేర్చుకున్నారు. పట్టుదలతో చదువులో రాణించారు. హిందీ, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీలు పూర్తి చేసి, స్వయం కృషితో ఆర్‌ఏఎస్ (RAS) పరీక్షకు సిద్ధమయ్యారు. అనంతరం రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) 2024 పరీక్షలో విజయం సాధించి తహసీల్దార్‌గా (Tehsildar) ఉద్యోగం సాధించారు. అయితే ఇది ఆయన రెండో ప్రయత్నం. మొదటి ప్రయత్నంలో విజయం లభించినప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో నిరుత్సాహపడకుండా మరింత కష్టపడ్డారు. చివరికి దివ్యాంగుల విభాగంలో నాల్గవ ర్యాంక్ సాధించి, తహసీల్దార్‌గా నియామకం పొందారు. రాజ్‌వీర్ తండ్రి విక్రమ్ సింగ్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో ఆయన ఈ ఘనత సాధించారు.


