తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య | Farmer commits dead Tahsildars office | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య

Oct 4 2026 4:54 AM | Updated on Oct 4 2026 4:54 AM

Farmer commits dead Tahsildars office

భూ వివాదమే కారణం.. నలుగురిపై కేసు

మహబూబ్‌నగర్‌ క్రైం: భూ వివాదంతో మనస్తాపానికి గురైన ఓ రైతు తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల కిందట నలుగురు వ్యక్తులు భూమిలో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు తొలగించడంతో పాటు పంట నష్టం చేశారు. ఊర్లో పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టినా రాజీ కుదరకపోగా.. తిరిగి అతడిపైనే దాడి చేయడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై లావప్ప (54) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో శనివారం చోటుచేసుకుంది. 

కోయిలకొండ ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పారుపల్లి శివారులోని సర్వే నంబర్‌ 211లో మొత్తం 18 ఎకరాల 39 గుంటల భూమి ఉంది. ఇందులో ఎకరం 7 గుంటల భూమి మిస్సింగ్‌ సర్వే నంబర్‌ కింద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూమి లావప్ప సోదరి లక్ష్మమ్మ పేరుపై ఉన్నట్లు సమాచారం. ఆమె భర్త మృతి చెందడంతో లావప్ప వద్దే ఉంటుండగా, ఆ భూమిని ఆయనే సాగుచేస్తున్నాడు. ఈ భూమి విషయంలో లావప్పకు, ఆయన బంధువులు లక్ష్మయ్య, చంద్రశేఖర్, విష్ణు, రామకృష్ణకు మధ్య సుమారు 20 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. 

ఈ వ్యవహారంపై ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఎకరం 7 గుంటల భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయాలని లావప్ప కొంతకాలంగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. నాలుగు రోజుల క్రితం లక్ష్మయ్య, చంద్రశేఖర్, విష్ణు, రామకృష్ణలు కలిసి ఆ పొలంలోని హద్దు రాళ్లు తొలగించి, పంటకు నష్టం చేశారని లావప్ప ప్రశ్నించడంతో అతడిపై దాడికి యత్నించారని ఆయన కుమారుడు కుర్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ ఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురైన లావప్ప శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు లక్ష్మయ్య, చంద్రశేఖర్, విష్ణు, రామకృష్ణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. కాగా, సర్వే నంబర్‌ 211లోని భూమిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినట్లు కోయిలకొండ తహసీల్దార్‌ శ్రీధర్‌రావు తెలిపారు. ఈ భూమితో లావప్పకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

మంత్రి పరామర్శ 
లావప్ప ఆత్మహత్య విషయం తెలుసుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఆయన కుమారుడు కుర్మయ్యతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. సమస్యపై వెంటనే విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని మహబూబ్‌నగర్‌ ఆర్‌డీవోను మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement