టెహ్రాన్: ఇప్పటివరకు పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతానికే పరిమితమైన ఇరాన్-అమెరికా ఘర్షణలు.. ఇప్పుడు క్రమంగా యూరప్ (ఐరోపా) దేశాలకు విస్తరిస్తూ అంతర్జాతీయ యుద్ధ మేఘాలను అలుముకునేలా చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తాము క్రమంగా పట్టు కోల్పోతున్నామనే నివేదికలు ఇరాన్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇదే తరుణంలో, హర్మూజ్ జలసంధి తమదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ఒక కొత్త మ్యాప్‌ను విడుదల చేయడం ఇరాన్ ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది.
ఈ పరిణామాలే ఇరాన్‌ను రక్షణాత్మక వైఖరి వీడి, యూరప్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై పూర్తి స్థాయి దాడికి యోచించేలా చేశాయంటూ ‘ఫైనాన్షియల్ టైమ్స్’సంచలన నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలో డ్రోన్ దాడికి గురైన సైప్రస్‌లోని బ్రిటిష్ వైమానిక స్థావరం కూడా ఇరాన్ దాడి చేసే లక్ష్యాల జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో బ్రిటిష్ సైనిక స్థావరంపై జరిగిన మొదటి దాడి ఇదే కావడంతో, ఇది అప్పట్లోనే ఇరు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రతరం కావడానికి నాంది పలికింది.
అలాగే, గత నెలలో తన ‘బెజ్మర్ వైమానిక స్థావరం’ నుండి అమెరికాకు చెందిన 8 బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానాలకు, 250 మంది సైనిక సిబ్బందికి ఆశ్రయమిచ్చి, వారు పనిచేసేందుకు అనుమతించిన ఆగ్నేయ ఐరోపా దేశమైన బల్గేరియాను కూడా ఇరాన్ తన ప్రతీకార లక్ష్యంగా గుర్తించినట్లు ఈ నివేదిక పేర్కొంది.
అమెరికాతో శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోవడంతో.. ఇరాన్ తన రక్షణాత్మక వైఖరిని వీడి పూర్తిగా దాడి చేసే సైనిక వ్యూహానికి మారాలని నిర్ణయించుకుందని సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ సుదీర్ఘ సంఘర్షణకు శాశ్వత ముగింపు పలకడానికి, అలాగే హర్మూజ్ జలసంధి నియంత్రణపై ఉన్న వివాదాలను పరిష్కరించడానికి జరుగుతున్న చర్చలు పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో ఇరాన్ ఈ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.


