స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటును రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. దేశంలో కొనసాగుతున్న గృహ సంక్షోభానికి సంబంధించి అత్యవసర చర్యలను ఆమోదించడంలో ఆయన ప్రభుత్వం గత వారం విఫలమైంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు నవంబర్ 29న జరగనున్నట్లు పెడ్రో సాంచెజ్ ప్రకటించారు.
ఇటీవలి కాలంలో స్పెయిన్‌లో నిరసనలు మిన్నంటాయి. ప్రజలు గృహాల ధరలు, అద్దెలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలకు ప్రభుత్వం పరిష్కారాలు చూపాలని పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గత నెలలో మాడ్రిడ్‌లో 87 ఏళ్ల వృద్ధ మహిళను ఆమె నివాసం నుంచి బహిష్కరించిన ఘటనను టెలివిజన్‌లో ప్రసారం చేయడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో దేశంలో నివాస గృహల సంక్షోభంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.
దీంతో గృహ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు అత్యవసర ఉత్తర్వులను పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు కలిసి అడ్డుకున్నాయి. ఆ ఉత్తర్వుల్లో బలవంతపు ఖాళీ చేయింపులను (evictions) తగ్గించడం, రియల్ ఎస్టేట్ రంగంలో ఊహాగానాలు, అధిక ధరల పెరుగుదలను నియంత్రించడం వంటి చర్యలు ఉన్నాయి. ఈ పరాజయం తర్వాత సాంచెజ్ వచ్చే ఏడాది జరగాల్సిన జాతీయ ఎన్నికలను ముందుకు తీసుకురావచ్చన్న ఊహాగానాలు విస్తృతంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ ద్వారా చేసిన ప్రసంగంలో సాంచెజ్ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో మరింత విస్తృతమైన ప్రగతిశీల కూటమి ఏర్పడితే దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలను పరిష్కరించేందుకు స్పెయిన్ ప్రజలకు అవకాశం లభిస్తుందన్నారు. “కాబట్టి, మీకు మరియు మీ దేశానికి ఎలాంటి భవిష్యత్తు కావాలో స్పెయిన్ ప్రజలే నిర్ణయించాల్సిన సమయం వచ్చింది” అని తన ప్రసంగంలో దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు.
54 ఏళ్ల పెడ్రో సాంచెజ్ 2018 నుంచి స్పెయిన్ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. యూరప్‌లో అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న నాయకుల్లో ఆయన కూడా ఒకరు.అంతర్జాతీయ స్థాయిలో సాంచెజ్ ప్రగతిశీల భావజాలం కలిగిన ప్రముఖ ప్రభుత్వాధినేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. వలసలను సమర్థించడం, పాలస్తీనియన్లకు మద్దతుగా దౌత్యపరమైన ప్రయత్నాలు చేయడం, ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ యుద్ధాన్ని విమర్శించడం వంటి అంశాల్లో ఆయన స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు.
అదే సమయంలో, ఇటీవలి సంవత్సరాల్లో స్పెయిన్ అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవడం కూడా సాంచెజ్ ప్రభుత్వానికి అనుకూల అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి.
ఇదీ చదవండి: ఫుడ్ డెలివరీ బాయ్‌పై అమానుషం


