గడ్చిరోలి: ప్రధాని నరేంద్ర మోదీ గత ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. గిరిజనుల సమస్యలను గత పాలకులు అర్థం చేసుకోలేదని, వారి సంక్షేమంపై శ్రద్ధ చూపలేదని వ్యాఖ్యానించారు. జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గిరిజనులకు హక్కులు కల్పించడంతోపాటు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నిర్వహించిన కార్యక్రమం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులతో మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు.
వెదురుపై బ్రిటిష్ కాలం నాటి చట్టం ప్రస్తావన
గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నేత్రంగ్ తాలూకా హతకుండి గ్రామానికి చెందిన వజీర్‌తో మోదీ మాట్లాడారు. 2004లో గుజరాత్ ప్రభుత్వ పథకం ద్వారా వెదురు ఉత్పత్తుల తయారీలో శిక్షణ పొందినట్లు వజీర్ తెలిపారు. పీఎం-జన్మన్ పథకం ద్వారా కూడా ప్రయోజనాలు పొందానని చెప్పారు. దీనిపై స్పందించిన మోదీ.. బ్రిటిష్ పాలకులు వెదురును చెట్టుగా వర్గీకరించి, దానిని నరికితే జైలుకు పంపేలా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే ఆ చట్టాన్ని రద్దు చేయాల్సి ఉండేదని, కానీ గత ప్రభుత్వాలు ఆ పని చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని తొలగించి గిరిజనులకు వెదురుపై పూర్తి హక్కులు కల్పించిందని చెప్పారు.
Watch: Prime Minister Narendra Modi says, "Friends, we also paid special attention to regions that had remained underdeveloped for a long time. A focused campaign for development, access to facilities and protection of citizens' rights was launched in more than 100 Aspirational Districts and over 500 Aspirational Blocks across the country. Many of these areas have a large tribal population..."
— IANS (@ians_india) November 15, 2026
పక్కా ఇల్లు రావడంతో మారిన జీవితం
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు చెందిన పీఎం-జన్మన్ పథకం లబ్ధిదారుడు కృష్ణ నాగోరావ్ టేకా తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. వర్షాకాలంలో ఇంట్లో ఉండటం కష్టంగా ఉండేదని, కీటకాలు, ఇతర సమస్యలతో ఇబ్బందులు పడేవారమని చెప్పారు. ఈ పథకం కింద తమకు పక్కా ఇల్లు, మరుగుదొడ్డి తదితర సదుపాయాలు అందాయని తెలిపారు. దీనిపై మోదీ స్పందిస్తూ గిరిజన కుటుంబాల జీవితాల్లో మార్పు రావడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధితోపాటు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పీఎం శ్రీ పాఠశాలలతో ఉన్నత విద్యకు అవకాశం
హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి సబావత్ అన్వేష్ కూడా ప్రధానితో మాట్లాడారు. పీఎం శ్రీ పాఠశాలల కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు.
రూ.3 వేల కోట్లతో 246 అభివృద్ధి పనులు
ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ సుమారు రూ.3,000 కోట్ల విలువైన 246 అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వీటిలో 173 ప్రాజెక్టులను ప్రారంభించారు. గిరిజన విద్యార్థుల కోసం 38 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, పీఎం-జన్మన్ కింద 100 బహుళ ప్రయోజన కేంద్రాలు వీటిలో ఉన్నాయి. పీఎం-జన్మన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద మరికొన్ని పనులను కూడా ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో గిరిజన పరిశోధనా సంస్థ భవనం, మిజోరంలోని ఐజ్వాల్‌లో రొపుయిలియాని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం కూడా వీటిలో ఉన్నాయి. గిరిజనుల చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడం ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం.
కొత్తగా 19 ఏకలవ్య పాఠశాలలకు శంకుస్థాపన
గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు మరో 19 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు 12 బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. పీఎం-జన్మన్, ధర్తీ ఆబా పథకాల కింద మరో 42 అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నవంబర్ 1 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన జనజాతీయ గౌరవ్ పక్షోత్సవాలకు ఈ కార్యక్రమంతో ముగింపు పలికారు.
ఇదీ చదవండి: శబరిమల యాత్ర: పంబలో భక్తులకు సకల ఏర్పాట్లు!


