ఖార్కివ్: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై రష్యా మరోసారి డ్రోన్లతో దాడికి పాల్పడింది. అక్టోబర్ 4 రాత్రి మూడు ‘బాండెరోల్’ జెట్ ఇంజిన్ డ్రోన్లతో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఖార్కివ్ మేయర్ ఇహోర్ తెరెఖోవ్ తెలిపారు. నగరంలోని ఇండస్ట్రియల్నీ జిల్లాలో నివాస భవనాల సమీపంలో డ్రోన్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. కొన్ని భవనాల పైకప్పులు కూడా దెబ్బతిన్నాయని మేయర్ తెలిపారు. ఖార్కివ్ ప్రాంతీయ సైనిక పరిపాలన అధిపతి ఒలెక్సాండర్ సినియెహుబోవ్ మాట్లాడుతూ.. ఓ దాడి ఎత్తైన భవనాన్ని తాకిందని చెప్పారు. ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రకారం.. దాడి అనంతరం ఓ పరిపాలనా భవనం, ఓ పారిశ్రామిక కేంద్రంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక, సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.
ఇదీ చదవండి: మెర్జ్ పర్యటనలోనే కీవ్‌పై రష్యా దాడులు!


