శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌పై భారత్‌లోని అమెరికా రాయభారి కీలక ప్రకటన చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని అమెరికా రాయబారి సెర్జియో గోర్ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం శ్రీనగర్‌కు వచ్చిన ఆయన.. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అనంతరం గోర్ మాట్లాడుతూ.. ‘‘కాశ్మీర్ భారత్‌లోని ముఖ్యమైన భాగం. నేను తొలిసారి ఇక్కడికి వచ్చాను. ఇది అద్భుతమైన అందమైన ప్రాంతం’’ అని అన్నారు.
ఒమర్ అబ్దుల్లాతో జరిగిన సమావేశంపై గోర్ మాట్లాడుతూ.. ‘‘మా సమావేశం ఎంతో స్నేహపూర్వకంగా జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని తెలిపారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ఆయన పక్కనే ఉన్నారు.
గోర్‌తో జరిగిన భేటీపై ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. అమెరికా-భారత్ సంబంధాలపై, ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ‘‘మాకు చాలా మంచి సమావేశం జరిగింది. ఇరు దేశాల సంబంధాలపై చర్చించే అవకాశం లభించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌కు అమెరికా ఏ విధంగా సహకరించగలదనే అంశంపై మాట్లాడాం. కొన్ని పాత సమస్యలు ఉన్నాయి. వాటిని కాలక్రమంలో పరిష్కరించేందుకు మేము కృషి చేస్తాం. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
వాషింగ్టన్, న్యూఢిల్లీ, శ్రీనగర్ మధ్య ఈ చర్చలు కొనసాగుతాయని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ‘‘అమెరికా, జమ్మూకశ్మీర్ మధ్య సంబంధాలు రాబోయే సంవత్సరాల్లో మరింత విస్తరించి, బలోపేతం అవుతాయని మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం’’ అని తెలిపారు.
అమెరికా ట్రావెల్ అడ్వైజరీపై కీలక వ్యాఖ్యలు
గోర్ పర్యటనలో అత్యంత కీలకమైన అంశాల్లో అమెరికా జారీ చేసిన జమ్మూకశ్మీర్ ప్రయాణ హెచ్చరిక సైతం ఒకటి. అమెరికా తన పౌరులకు జారీ చేసే ట్రావెల్ అడ్వైజరీలను క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని గోర్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ప్రస్తుత ప్రయాణ హెచ్చరికను కూడా పునఃపరిశీలించే అవకాశం ఉందని ఆయన సూచించారు.
కాశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రశంసించిన గోర్.. ట్రావెల్ అడ్వైజరీని మార్చడంపై తాను ప్రస్తుతం ఎలాంటి ‘‘పెద్ద ప్రకటన’’ చేయలేనని స్పష్టం చేశారు. అయితే దానిని తగ్గించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలించవచ్చని చెప్పారు.
‘‘ఈ ప్రాంతాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా మార్చేందుకు న్యూఢిల్లీ, ఇక్కడి ముఖ్యమంత్రి, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కొన్ని అద్భుతమైన చర్యలు తీసుకున్నాయని మేము భావిస్తున్నాం. అందువల్ల అమెరికా తన పౌరులకు జారీ చేసిన ప్రయాణ హెచ్చరికను తగ్గించాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని మేము పరిశీలిస్తాం’’ అని గోర్ తెలిపారు.
‘‘ఇది ఎంతో అందమైన ప్రాంతం. చాలా మంది అమెరికన్లు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత అందాలను ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుతం అమెరికా ట్రావెల్ అడ్వైజరీలో ఎలాంటి మార్పును అధికారికంగా ప్రకటించలేదు. అయితే గోర్ వ్యాఖ్యలు మాత్రం ఈ అంశాన్ని వాషింగ్టన్ పరిశీలిస్తున్నట్లు సూచిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రయాణ హెచ్చరికను సడలిస్తే కాశ్మీర్ పర్యాటక రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.
గతంలోనూ అమెరికా దౌత్యవేత్తలు జమ్మూకశ్మీర్‌ను సందర్శించారు. ముఖ్యంగా 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయపరమైన కార్యక్రమాల సందర్భంగా అమెరికా దౌత్యవర్గాలు ఈ ప్రాంతంలో పర్యటించాయి. అయితే గోర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జమ్మూకశ్మీర్‌ను ‘‘భారత్‌లో ముఖ్యమైన భాగం’’గా ఆయన పేర్కొనడం, అదే సమయంలో అమెరికా ట్రావెల్ అడ్వైజరీని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం న్యూఢిల్లీతో పాటు శ్రీనగర్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత జమ్మూకశ్మీర్‌లో గోర్ పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన అమెరికా రాయబారిగా మాత్రమే కాకుండా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయంగా వ్యూహాత్మక పరిణామాలు వేగంగా మారుతున్న సమయంలో అమెరికా నుంచి జమ్మూకశ్మీర్‌కు ఉన్నతస్థాయి దౌత్యపరమైన పర్యటన జరగడం ప్రాధాన్యంగా మారింది.
గతంలో పలుమార్లు వివాదాస్పదంగా
కాగా గతంలో పలుమార్లు అమెరికా జమ్ముకశ్మీర్ విషయంలో వివాదాస్పదంగా వ్యాఖ్యానించింది. 2003లో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారిక మార్గదర్శకాల్లో కశ్మీర్ ప్రాంతం భారత్, పాకిస్థాన్, చైనా ఆధీనంలోని ప్రాంతాలతో కూడిన “disputed region” అని పేర్కొంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా అమెరికా తన విధానంలో ఎలాంటి మార్పు లేదని, భారత్, పాకిస్థాన్ కశ్మీర్‌పై నేరుగా చర్చించుకోవాలని చెప్పింది. 2021లోనూ బైడెన్ ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తూ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈనేపథ్యంలో ప్రస్తుతం సెర్గియో గోర్ ఈవిధంగా వ్యాఖ్యానించడం గమనార్హం.


