ఆగస్టు వరకూ 254 మంది మృతి
నిందితులు మైనర్లైనా మేజర్లుగా విచారించాలి
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు వీహెచ్‌పీ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఆగస్టు వరకూ మత విద్వేషం కారణంగా జరిగిన దాడుల్లో 254 మంది హిందువులు మరణించినట్లు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆరోపించింది. ఈ ఘటనలకు బాధ్యులైన ‘తీవ్రవాద శక్తులపై’కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మతపరమైన విద్వేషంతో హిందువులపై జరిగే దాడుల కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు అప్పగించాలని, దోషులకు త్వరితగతిన కఠిన శిక్షలు విధించాలని కోరింది.
వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ, మత విద్వేషం కారణంగా హింస, హత్యలకు పాల్పడే మైనర్లను కూడా పెద్దలుగానే పరిగణించి విచారించాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి ఆగస్టు 31 వర కు హిందువులపై జరిగినట్లు ఆరోపిస్తున్న దాడులు, 254 మంది మృతుల వివరాల జాబితాను ఆయన విడుదల చేశారు.
అప్రమత్తంగా ఉండాలి...
మతోన్మాద భావజాలాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, దేశ విభజన మతప్రాతిపదికన జరిగిన తరువాత కూడా సెక్యులరిజమ్ పేరిట కొందరిని మెప్పించే కార్యక్రమాలు కొనసాగడంతో దేశ సమస్యలు మరింతగా పెరిగాయని ఆయన ఆరోపించారు. హిందూ మత కార్యక్రమాలపై దాడులు, ‘లవ్ జిహాద్’పేరిట బలవంతంగా లేదంటే మోసపూరితంగా హిందూ మహిళల అపహరణ, హిందూ నివాసాలపై దాడులు నిత్యకృత్యంగా మారుతున్నాయని జైన్ ఆరోపించారు. వివిధ సాకులతో మతోన్మాదులు హిందువులను హత్య చేస్తున్న ఘటనలకు అంతు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
ఈ సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడేందుకు ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హిందువులే తీవ్రవాద శక్తుల ప్రధాన లక్ష్యాలని ఆరోపిస్తూ, అప్రమత్తంగా ఉండాలని, ఆత్మరక్షణకు సిద్ధంగా ఉండాలని కోరారు. మత ఛాందస వాదం, విద్వేష ప్రచారానికి కేంద్రాలుగా మారిన మదర్సాలను నియంత్రించాలని జైన్ డిమాండ్ చేశారు. ఫ్లైదుబాయ్ ఘటనలో ప్రాణాలొడ్డి ఉగ్రవాద ఘటనను అడ్డుకున్న కెప్టెన్ స్మిట్ మచ్ఛార్‌ను వీహెచ్‌పీ ప్రశంసించింది. ఈ ఘటన మరో 9/11 తరహా కుట్ర అని జైన్ అభివరి్ణంచారు.


