Kanpur: ఘోర అగ్నిప్రమాదం.. మహిళ, బాలుడు మృతి! | Woman and teenager 2 people killed in kanpur fire | Sakshi
Sakshi News home page

Kanpur: ఘోర అగ్నిప్రమాదం.. మహిళ, బాలుడు మృతి!

Nov 16 2026 1:13 PM | Updated on Nov 16 2026 1:17 PM

Woman and teenager 2 people killed in kanpur fire

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సోమవారం (నవంబర్ 16) తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదు అంతస్తుల రాధిక అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 48 ఏళ్ల రాఖీ సాహూ, 15 ఏళ్ల ప్రాంజుల్ బాథమ్ ఉన్నారు. భవనంలో చిక్కుకుపోయిన మరో 8 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో మొదలైన మంటలు ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతానికి, అక్కడి నుంచి పై అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ భవనం మొత్తం కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు పక్క భవనాల మధ్య చెక్క పలకలు ఏర్పాటు చేసుకుని బయటపడగా, మరికొందరు బాల్కనీల నుంచి కిందకు దూకారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.
 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని హాలెట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మహిళ, బాలుడు మరణించారు. మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. పార్కింగ్ ప్రాంతంలో ఉన్న పలు స్కూటర్లు, మోటార్ సైకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

కాగా, ఈ అపార్ట్‌మెంట్ ఇరుకైన సందులో ఉండటం, బయటకు వెళ్లేందుకు పరిమిత మార్గం మాత్రమే ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురైనట్లు స్థానికులు తెలిపారు. అత్యవసర సహాయ నంబర్ 112కు ఫోన్ చేసినా సకాలంలో స్పందన రాలేదని ఆరోపించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement