వివాదంలో తమిళనాడు మంత్రి.. వైరల్ వీడియోతో దుమారం! | Tamil Nadu minister Vanni Arasu runs towards tiger viral video | Sakshi
Sakshi News home page

వివాదంలో తమిళనాడు మంత్రి.. వైరల్ వీడియోతో దుమారం!

Nov 16 2026 12:50 PM | Updated on Nov 16 2026 1:09 PM

Tamil Nadu minister Vanni Arasu runs towards tiger viral video

చెన్నై: తమిళనాడులో ఓ మంత్రి చేసిన పని అటవీ పర్యటన వివాదానికి దారితీసింది. అడవిలో పులి కనిపించగానే దాని వైపు పరుగెత్తడం, ఏనుగుల గుంపు దగ్గరకు వెళ్లడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలను స్వయంగా మంత్రే షేర్ చేయడంతో వన్యప్రాణుల సంరక్షణపై చర్చ మొదలైంది. అటవీ నిబంధనలను ఉల్లంఘించారంటూ పర్యావరణ పరిరక్షణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడు సామాజిక న్యాయం, ఆదిద్రావిడ సంక్షేమం, కొండ ప్రాంత గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వన్నీ అరసు కుటుంబ సభ్యులతో కలిసి ముదుమలై టైగర్ రిజర్వ్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా అటవీ శాఖ నిర్వహించిన సఫారీ వాహనాల్లో ప్రయాణించారు. ఆయన వెంట అటవీ సిబ్బంది, అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేసిన వీడియోను కూడా మంత్రి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అయితే పులి వైపు పరుగెత్తడం, ఏనుగుల దగ్గరకు వెళ్లడం వంటి దృశ్యాలు ఇందులో ఉండటం వివాదానికి కారణమయ్యాయి.

నిబంధనల ఉల్లంఘన జరిగిందా?
సఫారీ సమయంలో పర్యాటకులు వాహనాల నుంచి దిగకూడదని, వన్యప్రాణులను వెంబడించకూడదని, వాటికి దగ్గరగా వెళ్లకూడదని అటవీ నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి చర్యలు వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972కు విరుద్ధమని పరిరక్షణవాదులు ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, మంత్రి రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లలేదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఆయన బస చేసిన అచకరై ప్రాంతంలోని రిసార్ట్‌కు చెందిన ప్రైవేట్ స్థలంలోనే పులి కనిపించిందని తెలిపారు. వీడియో తీసిన సమయంలో మంత్రి సఫారీ వాహనం దిగలేదని, ఆయన భద్రత కోసమే అటవీ సిబ్బంది వెంట ఉన్నారని వివరణ ఇచ్చారు.

బీజేపీ విచారణకు డిమాండ్
ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి స్పందించారు. మంత్రి షేర్ చేసిన వీడియోల్లో అటవీ నిబంధనలకు విరుద్ధమైన దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. సామాన్య పర్యాటకులకు వర్తించే నిబంధనలు మంత్రులకు కూడా వర్తించాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై అటవీ శాఖ పారదర్శక విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, పులి కనిపించిన ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందా? మంత్రి నిజంగానే సఫారీ నిబంధనలు ఉల్లంఘించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అటవీ శాఖ విచారణలో ఏం తేలుతుందో చూడాలి.

ఇదీ చదవండి: మహారాష్ట్రలో పొలిటికల్‌ సస్పెన్స్‌.. సునేత్రా వరుస భేటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement