ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దివంగత అజిత్ పవార్ మరణంతో తెరమరుగైన ఎన్సీపీ విలీన చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్ వరుస భేటీలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఆదివారం ముంబైలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమైన ఆమె.. అనంతరం పూణే విమానాశ్రయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. దీంతో ఎన్సీపీలోని రెండు వర్గాల విలీనంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అయితే, సునేత్రా పవార్‌తో తన భేటీకి ఎన్సీపీ విలీనంతో ఎలాంటి సంబంధం లేదని సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మరోవైపు సోమవారం అమిత్ షాతో సునేత్రా, ఆమె కుమారుడు పార్థ్ పవార్ మరిన్ని చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల అజెండాపై మాత్రం స్పష్టత లేదు. గతంలో విలీనంపై ప్రశ్నించగా.. ‘సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’ అంటూ సునేత్రా వ్యాఖ్యానించడం గమనార్హం.
అజిత్ ఉన్నప్పుడే విలీనానికి అంగీకారం?
ఎన్సీపీ విలీనంపై ఇటీవల శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ ఉన్నప్పుడే రెండు వర్గాల మధ్య విలీన చర్చలు జరిగాయని, ఒక తేదీని కూడా ఖరారు చేశామని వెల్లడించారు. అయితే, తన సోదరుడు అజిత్ మరణించిన తర్వాత తమ వైపు నుంచి ఆ చర్చలకు ముగింపు పలికినట్లు స్పష్టం చేశారు. సునేత్రా వర్గం నుంచి విలీనంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.
విలీన చర్చలకు కారణమేంటి?
నవంబర్ 1న ఎన్సీపీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజ్‌బల్ ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు. పార్టీలో అంతర్గత విభేదాలు, శరద్ పవార్ వర్గంతో విలీన అవకాశాలపై చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సునేత్రా పవార్ తన అధికారిక నివాసం దేవ్‌గిరిలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీలో కీలక నియామకాలు, పార్థ్ పవార్ ప్రాధాన్యం పెరుగుతుండటంపై సీనియర్లలో అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు ప్రఫుల్ పటేల్ శరద్ పవార్‌ను, పార్థ్ పవార్ తన తాతను కలవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
2023లో అజిత్ పవార్ శరద్ పవార్ నుంచి విడిపోయి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో చేరడంతో ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుతం సునేత్రా పవార్ అధికార కూటమిలోని ఎన్సీపీ వర్గానికి నాయకత్వం వహిస్తుండగా.. శరద్ పవార్ ఎన్సీపీకి నేతృత్వం వహిస్తున్నారు. తాజా పరిణామాలతో ఈ రెండు వర్గాలు మళ్లీ ఒక్కటవుతాయా? లేక రాజకీయంగా కొత్త సమీకరణాలు తెరపైకి వస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చిన భారత్!


