ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విలీన అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్సీపీకి చెందిన రెండు వర్గాలు తిరిగి ఒక్కటవుతాయంటూ కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు ఎన్సీపీ (శరద్ పవార్) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే తెరదించారు. తన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంతో రెండు పార్టీల విలీనానికి సంబంధించిన చర్చలు ముగిసిపోయాయని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఎన్సీపీ అధ్యక్షురాలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సుప్రియా సూలే.. రెండు పార్టీల విలీనంపై తనకు ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని తెలిపారు. తనను ఎవరూ సంప్రదించలేదని, ఈ అంశంపై తనతో ఎవరూ చర్చించలేదని స్పష్టం చేశారు. రెండు ఎన్సీపీ వర్గాల విలీనంపై గతంలో చర్చలు జరిగిన విషయాన్ని సుప్రియా సూలే అంగీకరించారు. అజిత్ పవార్ బతికి ఉన్న సమయంలో ఈ అంశంపై కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా జనవరి 17న బారామతిలోని గోవింద్‌బాగ్‌లో శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియో ఇప్పటికే బహిరంగంగా ఉందని గుర్తుచేశారు. ఆ సమావేశంలో రెండు పార్టీల విలీనంపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. అయితే అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో పరిస్థితులన్నీ మారిపోయాయని, అప్పటివరకు కొనసాగిన విలీన ప్రక్రియ అక్కడితో ముగిసిపోయిందని సుప్రియా సూలే స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 12న విలీనం జరగాల్సిందేనా?
ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే గత నవంబర్ 6న విలీన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ జీవించి ఉంటే రెండు ఎన్సీపీ వర్గాలు ఫిబ్రవరి 12న ఒక్కటయ్యేవని వెల్లడించారు. విలీనానికి సంబంధించిన చర్చలు గతంలో నిజంగానే జరిగాయని, దీనిపై అజిత్ పవార్ తనకు వివరించారని తట్కరే పేర్కొన్నారు. అయితే ఆయన మరణంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో మహారాష్ట్ర రాజకీయాల్లో విలీనంపై చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యంగా రెండు వర్గాలకు చెందిన సీనియర్ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
అమిత్ షాతో ఎన్సీపీ నేతల భేటీ..
ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీకి చెందిన పలువురు కీలక నేతలు సమావేశమయ్యారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత రెండు ఎన్సీపీ వర్గాలు తిరిగి కలిసే అవకాశాలున్నాయనే ప్రచారం ఊపందుకుంది. అనంతరం తట్కరే బారామతిలో సునేత్రా పవార్‌ను, ఆ తర్వాత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన అధికారిక నివాసం వర్షాలో కలిశారు. ఈ వరుస సమావేశాలు విలీనంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచాయి.
సునేత్రా పవార్ ఏమన్నారంటే?
విలీనంపై వస్తున్న వార్తల గురించి బుధవారం మీడియా ప్రశ్నించగా సునేత్రా పవార్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. మీకు ఆ అంశంపై ఎక్కువ ఆసక్తి ఉందని నాకు తెలుసు. అయినప్పటికీ సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీకే తెలుస్తాయి అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీంతో, సునేత్రా వ్యాఖ్యలు విలీనానికి అవకాశాలున్నాయనే ప్రచారానికి మరింత ఆజ్యం పోశాయి. మొత్తంగా.. అజిత్ పవార్ మరణానికి ముందు రెండు ఎన్సీపీ వర్గాలు ఒక్కటయ్యేందుకు ప్రయత్నాలు జరిగినట్లు నేతల వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. కానీ ఇప్పుడు సుప్రియా సూలే తాజా ప్రకటనతో విలీనంపై ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో విలీనం అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: పాక్‌తో చర్చలు మొదలెట్టండి.. ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్


