పవార్‌ ఫ్యామిలీలో ట్విస్ట్‌.. సునేత్రా వ్యాఖ్యలతో పొలిటికల్ సస్పెన్స్‌! | Sunetra Pawar leaves NCP merger question Twist In Maha Politics | Sakshi
Sakshi News home page

పవార్‌ ఫ్యామిలీలో ట్విస్ట్‌.. సునేత్రా వ్యాఖ్యలతో పొలిటికల్ సస్పెన్స్‌!

Nov 12 2026 7:20 AM | Updated on Nov 12 2026 7:26 AM

Sunetra Pawar leaves NCP merger question Twist In Maha Politics

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ కుటుంబం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. 2023లో విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రెండు వర్గాలు మళ్లీ ఒక్కటవుతాయా? శరద్ పవార్, సునేత్రా పవార్ వర్గాల మధ్య రాజకీయ సయోధ్య కుదురుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
ఈ ఊహాగానాలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత సునేత్రా పవార్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ పెంచాయి. బుధవారం బారామతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్సీపీ విలీనంపై ప్రశ్నించగా.. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అంటూ ఆమె సమాధానాన్ని దాటవేశారు. విలీనంపై చర్చలు జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.

మరోవైపు శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సునేత్రా పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన 20 నుంచి 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పవార్ కుటుంబ పెద్ద శరద్ పవార్‌తో పలువురు ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారని ఆరోపించారు. వారు ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్)లో చేరవచ్చని లేదా ఎన్నికలకు ముందు మరో పార్టీలోకి వెళ్లవచ్చని రౌత్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ వారు తిరిగి వస్తే దాన్ని విలీనం అనడం కంటే సొంతింటికి తిరిగి రావడంగానే చూడాలని వ్యాఖ్యానించారు.

అమిత్ షాతో నేతల భేటీలు..
సునేత్రా పవార్ పార్టీ వ్యవహారాలపై సీనియర్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందన్న వార్తలు కూడా విలీన చర్చలకు ఆజ్యం పోస్తున్నాయి. పార్టీలో కీలక నియామకాలు, నిర్ణయాల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమైనట్లు కథనాలు వెలువడ్డాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు సునేత్రా పవార్ తన అధికారిక నివాసం దేవగిరిలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

పవార్‌ను కలిసిన ప్రఫుల్ పటేల్..
నవంబర్ 5న సీనియర్ ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్‌ను పరామర్శించడం కూడా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా తీసిన వీడియోలో నవంబర్ 10 తర్వాత మరోసారి కలుద్దామని శరద్ పవార్ సూచించినట్లు కనిపించింది. అయితే తాను కేవలం ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికే వెళ్లానని ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. మరోవైపు పార్థ్ పవార్ కూడా రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు తన తాత శరద్ పవార్‌ను కలవడం విలీన ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

బీజేపీ రియాక్షన్‌.. 
ఈ పరిణామాలపై బీజేపీ మంత్రి ఆశిష్ షెలార్ ఆసక్తికరంగా స్పందించారు. పవార్ కుటుంబంలోని అన్నాచెల్లెళ్లు మళ్లీ ఒక్కటవుతుంటే సంతోషించాల్సిన విషయమేనని భాయ్ దూజ్ పండుగను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. ఇక ఎన్సీపీ నేత సునీల్ తట్కరే మాత్రం ప్రస్తుతం రెండు వర్గాల మధ్య విలీన చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. అయితే అజిత్ పవార్ జీవించి ఉంటే రెండు వర్గాలు తిరిగి కలిసేవని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం విలీనంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆ రెండు పార్టీలేనని, అయితే మహాయుతి కూటమిని కూడా సంప్రదించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కొత్త ఇన్‌చార్జ్‌పై కాంగ్రెస్‌ కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement