డిసెంబర్‌ మొదటి వారంలో పార్లమెంట్‌  | Parliament winter session likely in 1st week of December 2026 | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ మొదటి వారంలో పార్లమెంట్‌ 

Nov 16 2026 5:57 AM | Updated on Nov 16 2026 5:57 AM

Parliament winter session likely in 1st week of December 2026

శీతాకాల సమావేశాల తేదీలపై ప్రభుత్వం తర్జనభర్జనలు 

మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ మొదటి వారంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశాల తేదీలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో ముడిపెట్టిన మహిళా రిజర్వేషన్‌ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. 

ఇప్పటికే ఓటరు జాబితా సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని, కేంద్రానికి అనుకూలంగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలన్న ప్రతిపక్షాల డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్న వేళ ఈ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వం లోక్‌సభలో సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850 వరకు పెంచాలని ప్రతిపాదించింది. 

సీట్ల పెంపు ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను పార్లమెంట్‌తోపాటు రాష్ట్రాల శాసనసభల్లో అమలు చేయాలని తలపోస్తోంది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో సీట్ల భారీ పెంపునకు రంగం సిద్ధం చేసింది. 2029 సాధారణ ఎన్నికల కల్లా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలనుకుంటోంది. ఇందుకు గాను ప్రభుత్వం శీతాకాల సమావేశాలను డిసెంబర్‌ మొదటి వారంలో జరపాలని నిర్ణయించినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. తేదీల ఖరారుపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.  

సభా కార్యకలాపాలు అనుమానమే 
గణాంకాల దృష్ట్యా చూస్తే కీలకమైన ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవడం ప్రభుత్వానికి అంత తేలికైన విషయం కాదు. లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ, 543 మంది సభ్యులకు గాను కనీసంగా 361 మంది మద్దతు కూడగట్టడం తప్పనిసరి. ప్రస్తుతం లోక్‌సభలో మూడు ఖాళీలు ఏర్పడటంతో సభ్యుల సంఖ్య 540గా ఉంది. అధికార ఎన్డీయే బలం 320 మంది మాత్రమే. 

ప్రభుత్వం తన లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ప్రతిపక్ష పార్టీల్లో కొన్నిటిని తన వైపు తిప్పుకోక తప్పదు. దీనితోపాటు, ప్రతిపక్ష పార్టీలు సర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేశాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ దిగిపోవాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి. ఈ మేరకు పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనలు తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశాలున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో సభా కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశాలే లేవని, అలాంటప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టడం, చర్చ చేపట్టడం సాధ్యమయ్యే పని కాదని అధికార కూటమికి చెందిన ఓ ఎంపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ ఈ కీలక బిల్లును ఆమోదింప జేసుకోవడం కష్టమేం కాదన్న ధీమాతో ప్రభుత్వం ఉంది. బిల్లును 15 నుంచి 18 ఓట్ల మెజారిటీతో గట్టెక్కించుకోగలమని అధికార పక్షానికి చెందిన సీనియర్‌ నేత ఒకరు అంటున్నారు. ఏప్రిల్‌ 17న జరిగిన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశంలో ఈ ప్రతిపాదిత బిల్లు అవసరమైన సంఖ్యాబలం లేక వీగిపోయింది దీంతో, శీతాకాల సమావేశాల్లో దీనిని నెగ్గుకొచ్చేలా చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. 

అధికారికంగా ముగియని వర్షాకాల భేటీ 
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం అధికారికంగా ముగించలేదు. ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి రికార్డు స్థాయిలో 94 రోజులుగా ప్రభుత్వం అధికారికంగా ఈ సమావేశాలను ముగిసినట్లు ప్రకటించలేదు.రాజ్యాంగ సవరణను తక్కువ వ్యవధిలోనే ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకునేందుకే ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉంచుకుందని భావించారు. ఈ సమయంలో శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించిన వార్తలు వెలువడటం మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. కాగా, ప్రస్తుత సమావేశాల కాలపరిమితిని పొడిగించడానికి కనీసం రెండు రోజుల ముందస్తు నోటీసు అవసరం కాగా, కొత్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 14 రోజుల ముందస్తు నోటీసు అవసరం. అయితే, సభను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత, దానిని అధికారికంగా ముగించడాని (ప్రొరోగ్‌)కి రాజ్యాంగం నిర్దిష్ట కాలపరిమితిని ఏదీ నిర్ణయించలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement