న్యూఢిల్లీ: డేటింగ్ యాప్‌లో కుదిరిన పరిచయం ప్రేమగా మారిందని ఆమె నమ్మింది. ఏడాది పాటు మాట్లాడుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే ఆశతో కెనడా నుంచి భారత్‌కు వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక ఆమె వయసు తెలియగానే యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని నీమ్రానాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పానిపట్‌కు చెందిన నితిన్ అనే యువకుడికి ఏడాది క్రితం డేటింగ్ యాప్‌లో కెనడాకు చెందిన 61 ఏళ్ల మహిళ పరిచయమైంది. కొంతకాలానికి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ 11న టూరిస్ట్ వీసాపై ఆ మహిళ ఢిల్లీకి చేరుకుంది. విమానాశ్రయానికి వచ్చిన నితిన్ ఆమెను నీమ్రానాలోని బీబీ బిల్డర్స్ సొసైటీలో ఉన్న తన బంధువుల ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు.
అక్కడ ఇద్దరూ సుమారు రెండు రోజుల పాటు ఉన్నారు. అయితే పెళ్లి విషయం చర్చకు వచ్చినప్పుడు మహిళ వయసు 61 ఏళ్లని తెలుసుకున్న నితిన్ పెళ్లికి నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిణామంతో ఆందోళనకు గురైన మహిళ నవంబర్ 13న కెనడా రాయబార కార్యాలయాన్ని సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించింది. దౌత్య కార్యాలయం సమాచారంతో తెల్లవారుజామున 4 గంటలకు నీమ్రానా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణతో నితిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం మహిళను కోట్‌పుట్లిలోని కేర్ సెంటర్‌లో ఉంచారు. ఆమెను సురక్షితంగా తిరిగి కెనడా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికా: తీరని విమాన కష్టాలు.. 530 రద్దు, 430 ఆలస్యం!


