న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదివారం ఉదయం నుంచే నగరంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఐఐటీ ఢిల్లీ పరిసరాల్లో అత్యధికంగా 426 ఏక్యూఐ నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)నవంబర్ 15వ తేదీ ఉదయం 6 గంటలకు వెల్లడించిన గణాంకాలు రాజధానిలో పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.
తీవ్ర స్థాయికి చేరిన కాలుష్యం
ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో 417, ఐటీఓలో 415 ఏక్యూఐ నమోదైంది. ద్వారకలో 407, జాఫర్‌పూర్‌లో 406, కామన్వెల్త్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ పరిసరాల్లో 404 చొప్పున రికార్డయ్యాయి. పూసాలో 402, బురారీ క్రాసింగ్‌లో 401 ఏక్యూఐ నమోదైంది. ఈ ప్రాంతాలన్నీ తీవ్ర కాలుష్య స్థాయిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మిగతా ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి
రాజధానిలోని ఇతర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత మెరుగ్గా లేదు. మథుర రోడ్డులో 394, పంజాబీ బాగ్‌లో 387, చాందినీ చౌక్‌లో 386, జేఎన్‌యూలో 385 ఏక్యూఐ నమోదైంది. వసుంధర ఎన్‌క్లేవ్‌లో 380, తల్కటోరా గార్డెన్‌లో 375, వివేక్ విహార్‌లో 374, సిరిఫోర్ట్‌లో 369, చావ్లాలో 366గా గాలి నాణ్యత సూచీ నమోదైంది.
తీవ్ర కాలుష్య కేటగిరీలో తొమ్మిది ప్రాంతాలు
సీపీసీబీ ప్రమాణాల ప్రకారం 0-50 మధ్య ఏక్యూఐ ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లు పరిగణిస్తారు. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరంగా, 101-200 మధ్య ఉంటే మోస్తరుగా, 201-300 మధ్య ఉంటే పేలవంగా, 301-400 మధ్య ఉంటే అత్యంత పేలవంగా పరిగణిస్తారు. 401-500 మధ్య నమోదైతే తీవ్ర కాలుష్యంగా వర్గీకరిస్తారు. ఆదివారం ఉదయం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఢిల్లీలోని తొమ్మిది పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ తీవ్ర స్థాయికి చేరగా, మరో 23 కేంద్రాల్లో అత్యంత పేలవమైన స్థితి నమోదైంది.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
గాలి నాణ్యత ఈ స్థాయికి పడిపోవడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఉదయం నుంచే కాలుష్య తీవ్రత కొనసాగుతుండటంతో రాజధాని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: ఇరాన్‌కు ఇక చుక్కలే.. నెతన్యాహు హెచ్చరిక!


