భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం రాయ్‌సేన్ జిల్లాలోని నర్మదా లోయలో 65 లక్షల ఏళ్ల నాటి శిలాజం లభ్యమైంది. ఇది ఏనుగును పోలి ఉండే ఒక భారీ ప్రాచీన క్షీరదానికి చెందిన దవడ ఎముక శిలాజమని గుర్తించారు. ఈ జంతువు సుమారు 10.5 అడుగుల ఎత్తు, సుమారు 7.5 మెట్రిక్ టన్నుల బరువు కలిగి ఉండేదని అంచనా వేస్తున్నారు. భారీ శరీరం, ప్రత్యేకమైన దంతాలు దీని ప్రధాన లక్షణాలు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ)కి చెందిన నలుగురు సభ్యుల బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది.
అంతరించిపోయిన స్టెగోడాన్ నమాడికస్ జాతికి చెందినదిగా భావిస్తున్న ఈ శిలాజం జిల్లా కేంద్రానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటాయ్ గ్రామ సమీపంలో నదీ కోత వల్ల బయటపడింది. పురావస్తు పరిశోధనలకు ఈ ఆవిష్కరణ చాలా కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. 65 లక్షల ఏళ్ల నాటి దవడ ఎముక లభించడం నర్మదా లోయలోని ప్రాచీన పర్యావరణం, మానవ పరిణామ క్రమ చరిత్రపై అవగాహన కల్పించడానికి దోహదపడుతుందని సాగర్ విశ్వవిద్యాలయానికి చెందిన మాజీ ప్రొఫెసర్ ఒకరు పేర్కొన్నారు.


