PC: BCCI Domestic X
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కేరళ కెప్టెన్, టీమిండియా స్టార్ సంజూ శాంసన్ విఫలమయ్యాడు. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ బాది నిష్క్రమించాడు.
కాగా దేశీ టీ20 టోర్నీ తాజా ఎడిషన్ శనివారం మొదలైంది. న్యూ చండీగఢ్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో కేరళ- మధ్యప్రదేశ్ బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన కేరళ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్‌లో ఓపెనర్లు సంజూ శాంసన్ (4), మహ్మద్ అజారుద్దీన్ (10)... అహ్మద్ ఇమ్రాన్ (1) పూర్తిగా విఫలమయ్యారు.
ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ సల్మాన్ నిజార్, ఐదో స్థానంలో వచ్చిన అఖిల్ స్కేరియా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. సల్మాన్ 53 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 69 పరుగులు సాధించాడు. అఖిల్ 35 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించారు.
మిగిలిన వారిలో విష్ణు వినోద్ (6) విఫలం కాగా.. నిఖిల్ ఎమ్, కార్తిక్ నాయర్ తలా రెండు పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన కేరళ కేవలం 138 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేశ్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ రెండు, శివాంగ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి: పృథ్వీ షా ఫర్వాలేదనిపించినా.. తప్పని ఓటమి
అవకాశం ఇచ్చినా ఫెయిల్ అయ్యాడు.. ఇలా అయితే కష్టం: గంభీర్


