మూల్యం చెల్లించాల్సి వచ్చింది: రోహిత్‌, ఇషాన్‌లపై గంభీర్‌ ఫైర్‌! | We had to pay for it Gambhir blames Rohit Ishan dropped Catches IND defeat | Sakshi
Sakshi News home page

మూల్యం చెల్లించాల్సి వచ్చింది: రోహిత్‌, ఇషాన్‌లపై గంభీర్‌ ఫైర్‌!

Nov 14 2026 4:20 PM | Updated on Nov 14 2026 4:24 PM

We had to pay for it Gambhir blames Rohit Ishan dropped Catches IND defeat

నబీ- గంభీర్‌ (PC: BCCI/Sonysports)

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో బ్యాటర్ల సమష్టి వైఫల్యం కారణంగా టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. మౌంట్‌ మౌంగనూయ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత జట్టు ఏకంగా 244 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (108 బంతుల్లో 125; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... టిమ్‌ సీఫెర్ట్‌ (58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిన్‌ అలెన్‌ (41; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

89 పరుగులకే ఆలౌటై
భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్, ఆఖిబ్‌ నబీ, గుర్‌నూర్‌ బ్రార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా ఘోరంగా తడబడింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెన్రీ (6/27) తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. 

ఈ క్రమంలో టీమిండియా కేవలం 26.4 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. వన్డేల్లో భారత్‌కు ఇది ఆరో అత్యల్పస్కోరు. న్యూజిలాండ్‌ చేతిలో రెండోది కావడం గమనార్హం.

నబీకి మద్దతుగా గంభీర్‌
ఈ నేపథ్యంలో భారత బౌలర్లు, బ్యాటర్ల వైఫల్యంపై విమర్శలు వస్తుండగా.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ మాత్రం యువ బౌలర్లకు మద్దతుగా నిలిచాడు. ముఖ్యంగా అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆకిబ్‌ నబీ గొప్పగా బౌలింగ్‌ చేశారన్నాడు. అయితే, విల్‌ యంగ్‌ను అవుట్‌ చేసేందుకు నబీకి రెండు మంచి అవకాశాలు వచ్చినా.. ఫీల్డర్ల వైఫల్యం కారణంగా దురదృష్టవశాత్తూ అతడు యంగ్‌ వికెట్‌ తీయలేకపోయాడన్నాడు.

రోహిత్‌, ఇషాన్‌ తప్పిదాల వల్ల
కాగా టీమిండియాతో గత రెండు మ్యాచ్‌ల్లో కివీస్‌ జట్టుకు శుభారంభం అందించలేకపోయిన యంగ్, సీఫెర్ట్‌ జంట ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఆకిబ్‌ నబీ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వరుస బంతుల్లో రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన యంగ్‌ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 

మరో ఎండ్‌లో సీఫెర్ట్‌ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో సీఫెర్ట్‌ 39 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకోగా... యంగ్‌ 49 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ దాటాడు. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించాక సీఫెర్ట్‌ను గుర్‌నూర్‌ బ్రార్‌ బుట్టలో వేసుకోగా... నిక్‌ కెల్లీ (4), ఫాక్స్‌క్రాఫ్ట్‌ (8) ఎక్కువసేపు నిలవలేకపోయారు. 

అయితే మిడిలార్డర్‌లో ఫిన్‌ అలెన్‌ అండతో యంగ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అర్ధశతకం అనంతరం దూకుడు పెంచిన అతడు 88 బంతుల్లోనే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. చివర్లో కెప్టెన్‌ సాంట్నర్‌ (24), క్రిస్టియన్‌ క్లార్క్‌ (22), జేమీసన్‌ (19 నాటౌట్‌) కీలక పరుగులు జోడించడంతో కివీస్‌ భారీ స్కోరు చేసింది.  

మూల్యం చెల్లించాల్సి వచ్చింది
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో అర్ష్‌, ఆకిబ్‌ గొప్పగా బౌలింగ్‌ చేశారు. నిజానికి యంగ్‌ను అవుట్‌ చేసేందుకు నబీకి మంచి అవకాశం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ యంగ్‌కు లైఫ్‌ దొరికింది. లేదంటే పరిస్థితి వేరుగా ఉండేది.

ఒక్క అవకాశం దొరికితే ఓ బ్యాటర్‌ ఏం చేయగలడో అది యంగ్‌ చేసి చూపించాడు. అతడికి రెండుసార్లు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇలా క్యాచ్‌లు జారవిడిచినపుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది’’ అని అన్నాడు. తద్వారా పరోక్షంగా రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌లను గంభీర్‌ టార్గెట్‌ చేశాడు.

ఇదీ చదవండి: అవకాశం ఇచ్చినా ఫెయిల్‌ అయ్యాడు.. ఇలా అయితే కష్టం: గంభీర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement