PC: X
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి మధ్యప్రదేశ్ తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు తమ స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్లకు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ చోటిచ్చింది.
నవంబరు 14 నుంచి మొదలు
ఐపీఎల్ స్టార్లు అనికేత్ వర్మ, ఆవేశ్ ఖాన్, టీమిండియా ఆటగాడు సారాంశ్ జైన్ తదితరులు ఈ జట్టులో ఉన్నారు. ఇక ఈ దేశీ టోర్నీ నవంబరు 14 నుంచి మొదలుకానుంది. గతంలో రజత్ పాటిదార్ సారథ్యంలోనే మధ్యప్రదేశ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సొంతం చేసుకుంది.
తొలి మ్యాచ్ ఆ జట్టుతోనే
మరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక ఈసారి మధ్యప్రదేశ్ ఎలైట్ గ్రూప్-‘సి’లో ఉండగా.. చండీగఢ్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో కేరళతో తలపడుతుంది.
కాగా రజత్ పాటిదార్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2025లో తొలిసారి టైటిల్ అందించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలోనే ఆర్సీబీ మరోసారి ట్రోఫీని ముద్దాడింది. మధ్యప్రదేశ్‌కు టైటిల్ అందించడం ద్వారా ఆర్సీబీ కెప్టెన్‌గా పాటిదార్ అవకాశాన్ని అందిపుచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. గత సీజన్‌లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో జార్ఖండ్ తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్.. టీ20 జట్టులో పాతుకుపోయాడు. వన్డేల్లో కూడా చోటు దక్కించుకుంటున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2026 టోర్నీకి మధ్యప్రదేశ్ జట్టు
అంకుశ్ సింగ్, అక్షత్ రఘువన్షీ, హర్ష్ గావిల్ (వికెట్ కీపర్), రజత్ పాటిదార్ (కెప్టెన్), అనికేత్ వర్మ, రితిక్ టడా, అపూర్వ్ ద్వివేది (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ సింగ్, శివం శుక్లా, శివాంగ్ కుమార్, ఆవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్, రాహుల్ బతామ్, మంగేశ్ యాదవ్.
ఇవీ చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు


