విదర్భ విక్టరీ | Vidarbha beats Madhya Pradesh by an innings and 20 runs in Ranji Trophy | Sakshi
Sakshi News home page

విదర్భ విక్టరీ

Nov 5 2026 1:17 AM | Updated on Nov 5 2026 1:17 AM

Vidarbha beats Madhya Pradesh by an innings and 20 runs in Ranji Trophy

వరుసగా నాలుగో గెలుపు

మధ్యప్రదేశ్‌పై ఇన్నింగ్స్‌ 20 పరుగుల తేడాతో ఘనవిజయం

హర్ష్ దూబే, పార్థ్‌ మాయాజాలం  

రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌  

నాగ్‌పూర్‌: దేశవాళీ ప్రతిష్టాత్మక ‘ఫస్ట్‌ క్లాస్‌’ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో మాజీ చాంపియన్‌ విదర్భ జోరు సాగుతోంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన విదర్భ... నాలుగో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో విదర్భ ఇన్నింగ్స్‌ 20 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసింది. నాలుగు విజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకున్న విదర్భ ప్రస్తుతం గ్రూప్‌లో  అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 19/1తో బుధవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌ జట్టు 33.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. 

సక్ష్యం పురోహిత్‌ (34; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ (0)తో పాటు సారాంశ్‌ జైన్‌ (2), యశ్‌ దూబే (4) విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో స్పిన్నర్లు హార్ష్ దూబే, పార్థ్‌ రఖాడే చెరో 5 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేయగా... విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగులిచ్చి 9 వికెట్లు తీసిన హార్ష్ దూబే... రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులిచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా 14 వికెట్లు తీసిన అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

కర్ణాటక భారీ గెలుపు 
రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా గువాహటి వేదికగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక ఇన్నింగ్స్‌ 314 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 496/5తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక చివరకు 133.2 ఓవర్లలో 577/6 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనీశ్‌ (145; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు మూడు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... మన్వంత్‌ కుమార్‌ (108 బంతుల్లో 100 నాటౌట్‌; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్‌ సెంచరీతో విజృంభించాడు. 

అస్సాం బౌలర్లలో రోషన్‌ ఆలమ్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అస్సాం 40.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ డెనిశ్‌ దాస్‌ (50; 8 ఫోర్లు) కాస్త పోరాడగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ 4, శిఖర్‌ శెట్టి మూడు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో బోనస్‌ పాయింట్‌ సహా ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకున్న కర్ణాటక జట్టు గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరింది.  

ఉత్తరాఖండ్‌ గెలుపు 
ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా డెహ్రాడూన్‌ వేదికగా హరియాణాతో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 296/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఉత్తరాఖండ్‌ చివరకు 125.4 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. డేగ నిశ్చల్‌ (387 బంతుల్లో 153; 14 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. హర్యానా బౌలర్లలో నిషాంత్‌ సింధు 5, కనిష్క్  చౌహాన్‌ నాలుగు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హర్యానా 55.5 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌ (31) టాప్‌స్కోరర్‌. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో జగదీశ సుచిత్‌ 4 వికెట్లు తీశాడు. దీంతో ఉత్తరాఖండ్‌ ముందు 8 పరుగుల లక్ష్యం నిలవగా... ఆ జట్టు 1.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 9 పరుగులు చేసి గెలిచింది. తాజా సీజన్‌లో ఉత్తరాఖండ్‌కు ఇదే తొలి విజయం.  

గోవా ఘనవిజయం 
ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా పనాజీ వేదికగా బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో గోవా ఘనవిజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన గోవా ఇన్నింగ్స్‌ 177 పరుగుల తేడాతో బిహార్‌ను మట్టికరిపించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 63/3తో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బిహార్‌ చివరకు 45.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఆయుశ్‌ లొహరుకా (47) తప్ప మిగిలినవాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. గోవా బౌలర్లలో లలిత్‌ యాదవ్‌ 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు గోవా తొలి ఇన్నింగ్స్‌లో 397 పరుగులు చేయగా... బీహార్‌ 107 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌ ఆడింది. భారీ శతకంతో చెలరేగిన గోవా మిడిలార్డర్‌ బ్యాటర్‌ స్నేహల్‌ కౌథాంకర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

తిప్పేసిన తనుశ్‌  
మాజీ చాంపియన్‌ ముంబై జట్టు రంజీ ట్రోఫీలో రైల్వేస్‌పై సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తోంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం ఆట ముగిసే సమయానికి ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు దివ్యాంశ్‌ సక్సేనా (114 బంతుల్లో 68 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), అంగ్‌క్రిష్‌ రఘువంశీ (85 బంతుల్లో 79; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో సత్తా చాటారు.

రైల్వేస్‌ బౌలర్లలో తౌఫీక్‌ ఉద్దీన్‌ 3 వికెట్లు తీశాడు. గురువారం ఆటకు చివరి రోజు కాగా... తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం ముంబై జట్టు 311 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 116/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన రైల్వేస్‌ 79.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. రవి సింగ్‌ (43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. ఆఫ్‌స్పిన్నర్‌ తనుశ్‌ కోటియాన్‌ (7/45) ధాటికి రైల్వేస్‌ బ్యాటర్లు నిలవలేకపోయారు.   

హైదరాబాద్‌ లక్ష్యం 259
సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో విజయానికి హైదరాబాద్‌ చివరి రోజు మరో 246 పరుగులు చేయాల్సి ఉంది. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. తన్మయ్‌ అగర్వాల్‌ (0), రుతిక్‌ మెండే (0) డకౌట్‌ కాగా... అభిరథ్‌ రెడ్డి (8 బ్యాటింగ్‌), రాహుల్‌ రాదేశ్‌ (3 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 68.4 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. మయాంక్‌ వర్మ (111 బంతుల్లో 81; 8 ఫోర్లు, 1 సిక్స్‌), సంజీత్‌ దేశాయ్‌ (123 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేయగా, ధర్మేంద్రసింగ్‌ జడేజా (38) రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రక్షణ్‌ రెడ్డి, అనికేత్‌ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement