సినాకాబెన్ (ఫిలిప్పీన్స్): భారత చెస్ అరుదైన మైలురాయి జాబితాలో చేరింది. 100 గ్రాండ్‌మాస్టర్లు అందించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. భారత చెస్ 100వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల అనూజ్ శ్రీవత్రి అవతరించాడు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఏసీఈఏఎన్) ప్లస్ వ్యక్తిగత ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో అనూజ్ విజేతగా నిలిచి అధికారికంగా గ్రాండ్ మాస్టర్ హోదాను ఖరారు చేసుకున్నాడు. నిరీ్ణత తొమ్మిది రౌండ్ల తర్వాత అనూజ్ 7పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ దక్కించుకున్నాడు.
జీఎం హోదా లభించాలంటే మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతోపాటు కెరీర్‌లో ఒకసారైనా 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించాలి. 2022లోనే మూడు జీఎం నార్మ్‌లు సాధించిన అనూజ్ ఏసీఈఏఎన్ టోర్నీ టైటిల్ గెలిచిన క్రమంలో 2500 ఎలో రేటింగ్‌ను కూడా దాటడంతో అతనికి గ్రాండ్‌మాస్టర్ హోదా ఖాయమైంది. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ (తమిళనాడు) 1988లో భారత తొలి గ్రాండ్ మాస్టర్‌గా అవతరించగా... 96 నుంచి 100వ గ్రాండ్‌మాస్టర్ మైలురాయిని గత ఐదు నెలల కాలంలో భారత్ అందుకుంది. గత ఐదు నెలల్లో భారత్ నుంచి ఈథన్ వాజ్, హర్షవర్ధన్, అశ్వత్, రత్నవేల్, అనూజ్ జీఎం హోదాను పొందారు. రష్యా, అమెరికా, జర్మనీ తర్వాత 100 లేదా అంతకంటే ఎక్కువమంది గ్రాండ్‌మాస్టర్లు అందించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.


