breaking news
Association of Southeast Asian Nations
-
తీమోర్కు సభ్యత్వం
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) సమావేశంలో కీలక పరిణా మాలు చోటు చేసుకు న్నాయి. 1990ల తర్వాత చేపట్టిన మొట్టమొదటి విస్తరణలో సమాఖ్య నూతన సభ్య దేశంగా తూర్పు తీమోర్ చేరింది. కాంబోడియా–థాయ్‌లాండ్‌ల మధ్య కాల్పుల విరమణను మరింతకాలం పొడిగించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సమావేశ వేదికపై ఏర్పాటు చేసిన జెండాల్లో తూర్పు తీమోర్ లేదా తిమోర్ లెస్టీ జెండాను కూడా చేర్చారు. తమ కల ఇప్పటికి నిజమైందని ఆ దేశ ప్రధానమంత్రి జనానా గుజ్మావో తెలిపారు. అదేవిధంగా, సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో సరిహద్దు సమస్యపై కాల్పుల విరమణను మరికొంతకాలం పొడిగించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై కాంబోడియా– థాయ్‌లాండ్ ప్రధానులు హున్ మనెట్, అనుతిన్ చర్న్విరకుల్లు సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా బందీలుగా ఉన్న 18 మంది కాంబోడియా సైనికులను థాయ్‌లాండ్ విడిచిపెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా, సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాలు మోహరించిన భారీ ఆయుధాలను ఉపసంహరించుకుంటాయి. ఒప్పందంలోని అంశాల అమలును పర్యవేక్షించేందుకు ఆసి యాన్ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ ఒప్పందాన్ని సంయుక్త ప్రకటనగా కాంబోడియా, థాయ్ నేతలు పేర్కొనగా ట్రంప్..కౌలాలంపూర్ శాంతి ఒప్పందంగా దీనిని అభివర్ణించారు. ఈ రెండు దేశాలతోపాటు మలేసియాతోనూ తాము కీలక ఖనిజాలు సహా పలు ఆర్థిక ఒప్పందాలను కుదుర్చుకున్నామని చెప్పారు. ట్రంప్‌తోపాటు చైనా ప్రధాని లీ క్వియాంగ్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జపాన్ నూతన ప్రధాని సనే తకాయిచీ, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా తదితర డజనుకు పైగా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు సాగే ఈ సమావేశాల్లో రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్, చైనాల నుంచి వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో సభ్య దేశాలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది.ట్రంప్–జిన్‌పింగ్ భేటీకి రంగం సిద్ధంఆధునిక సాంకేతికతకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల ఎగుమ తులపై చైనా నిషేధం విధించడం, వాటిని తొలగించకుంటే మరో 100 శాతం టారిఫ్‌లు తప్పవంటూ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక ఉద్రిక్తతలు ఆసియాన్ సమా వేశాల సందర్భంగా సడలిన జాడలు కనిపిస్తున్నాయి. కౌలాలంపూర్ వేదికగా అమెరికా, చైనా ఉన్నత స్థాయి ప్రతినిధులు జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదిరింది. చైనా వాణిజ్య ప్రతినిధి లి చెంగాంగ్ మీడియాతో మాట్లాడుతూ..రెండు పక్షాలు వివాదాస్పద అంశాలపై ప్రాథమిక ఏకాభిప్రాయానికి వచ్చాయని, సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా యని పేర్కొన్నారు. రెండు దేశాలు ఒప్పందం వైపు మొగ్గు చూపుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నారు. భవిష్యత్తులో చైనాలో పర్యటించాలనుకుంటున్నానని, అదేవిధంగా జిన్‌పింగ్ ఫ్లోరిడాలోని తన మార్ ఇ లాగో రిసార్టుకు లేదా వాషింగ్టన్కు వస్తారని చెప్పారు. -
‘ఆసియాన్’కు వర్చువల్‌గా
న్యూఢిల్లీ: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ దాకా జరుగనున్న అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఆసియాన్) 22వ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఆయన గురువారం మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో ఫోన్లో మాట్లాడారు. ఆసియాన్ సదస్సుకు స్వయంగా హాజరుకాలేనని, వర్చువల్‌గా ప్రసంగిస్తానని తెలియజేశారు. ‘‘నా మిత్రుడు అన్వర్ ఇబ్రహీంతో చక్కటి సంభాషణ జరిగింది. ఆసియాన్‌కు సారథ్యం వహిస్తున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేశా. వచ్చేవారం జరిగే సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఆసియాన్–ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్నదే నా ఆకాంక్ష’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. షెడ్యూలింగ్ సమస్య వల్లే మోదీ ఆసియాన్ సదస్సుకు వెళ్లలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బదులు ఈ సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హాజరు కాబోతున్నారు. మలేషియాలో మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా సమావేశమవుతారని తొలుత ప్రచారం జరిగింది. మోదీ గైర్హాజరు కానుండడంతో ఈ భేటీ లేనట్లే. అలాగే మోదీ మలేషియాకు వెళ్లడం లేదు కాబట్టి కాంబోడియా పర్యటన కూడా వాయిదా పడినట్లేనని స్పష్టమవుతోంది. ఆసియాన్ 1967 ఆగస్టు 8న ఐదు దేశాలతో ఏర్పాటయ్యింది. ప్రస్తుతం ఈ కూటమిలో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా దేశాలకు సభ్యత్వం ఉంది. ఆసియాన్–భారత్ మధ్య 1992లో భాగస్వామ్యం మొదలయ్యింది. 1995 డిసెంబర్లో పూర్తిస్థాయి భాగస్వామ్యంగా, 2002లో శిఖరాగ్ర స్థాయి భాగస్వామ్యంగా, 2012లో వ్యూహాత్మక భాగస్వామ్యంగా సంబంధాలు బలపడ్డాయి. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తదితర రంగాల్లో ఇరుపక్షాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ట్రంప్ నుంచి తప్పించుకోవడానికే మోదీ వెళ్లడం లేదు: కాంగ్రెస్ ఆసియాన్ సదస్సుకు స్వయంగా హాజరుకాకూడదని, వర్చువల్‌గా ప్రసంగించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గురువారం ‘ఎక్స్’లో తప్పుపట్టారు. మోదీ కౌలాలంపూర్‌కు వెళ్లకపోవడానికి అసలు కారణం వేరే ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుపడకుండా తప్పించుకోవడానికే మోదీ ఆసియాన్ సదస్సుకు దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశానంటూ ట్రంప్ ఇప్పటిదాకా 53 సార్లు చెప్పారని అన్నారు. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయదనిమోదీ హామీ ఇచ్చారంటూ కూడా ఐదుసార్లు చెప్పారని గుర్తుచేశారు. ట్రంప్ ప్రకటనలను మోదీ కనీసం ఖండించలేదని ఆరోపించారు. పైగా ట్రంప్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారని మండిపడ్డారు. ట్రంప్‌ను స్వయంగా కలిసి మాట్లాడే ధైర్యం మన ప్రధానమంత్రికి లేదని జైరామ్ రమేశ్ ధ్వజమెత్తారు. -
త్వరలో ట్రంప్, మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెలాఖరులో మలేసియాలో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కౌలాలంపూర్‌లో ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే 47వ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) శిఖరాగ్రానికి ఇద్దరు నేతలు హాజరుకా నున్నారు. ఈ సందర్భంగా వీరు సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమా చారం. సమావేశానికి రావాలంటూ మలేసియా ఇప్పటికే ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపించింది. ట్రంప్ పర్యటన ఖరారైన పక్షంలో, అమెరికా భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలుసుకునే మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం అవుతుంది. -
సిద్ధాంతం కన్నా దేశం మిన్న
న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కన్నా సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హాని చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) క్యాంపస్‌లో గురువారం స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్ విధానంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘సైద్ధాంతిక విభేదాలుండొచ్చు. అది సహజమే. అవి దేశ ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చేలా ఉండాలి కానీ నష్టపరిచేలా ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. జేఎన్‌యూలో నిరంతరం వామపక్ష, హిందుత్వ వాదుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుందన్న విషయం తెలిసిందే. సైద్ధాంతిక విబేధాలున్న పలు వర్గాలు.. తమ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ప్రకటిస్తూనే, ఒక్కటై, ఉమ్మడిగా పోరాటం చేశాయని స్వాతంత్య్ర ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అందువల్ల, దేశ ప్రయోజనాలు, సమగ్రత విషయంలో సైద్ధాంతిక ప్రభావంతో నిర్ణయం తీసుకోవడం హానికరమవుతుందని పేర్కొన్నారు. దేశం పట్ల ప్రేమను, అంకితభావాన్ని స్వామి వివేకానంద విగ్రహం ప్రజలకు నేర్పిస్తుందన్న విశ్వాసం తనకుందని మోదీ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద కలలు కన్న దృఢమైన, సౌభాగ్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ విగ్రహం స్ఫూర్తినిస్తుందన్నారు. 21వ శతాబ్దం భారత్‌దేనని 20వ శతాబ్దం ప్రారంభంలోనే స్వామి వివేకానంద చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. ఈ విగ్రహం నీడలోనే వివిధ అంశాలపై విద్యార్థులు చర్చలు జరపవచ్చని సూచించారు. ‘ఆత్మ విశ్వాసంతో పాటు అన్ని రంగాల్లో స్వతంత్రత, స్వావలంబన కలిగిన భారత పౌరులను తీర్చిదిద్దేలా మన విద్యా వ్యవస్థ ఉండాలని స్వామి వివేకానంద కోరుకున్నారు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఆ దిశగానే ఉంటుంది’ అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడంపై వర్సిటీ విద్యార్థి సంఘం నిరసన తెలిపింది. విగ్రహావిష్కరణ కన్నా ముందు విద్యార్థులు వర్సిటీ నార్త్ గేట్ వద్ద ‘మోదీ గో బ్యాక్’, ‘వి వాంట్ ఆన్సర్స్’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ‘స్కాలర్షిప్స్ రాని విద్యార్థుల గురించి ఆయన ఎందుకు మాట్లాడరు?’ అని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఐషె ఘోష్, సాయిబాలాజీ ప్రశ్నించారు. ‘ఆసియాన్’తో బంధమే ముఖ్యం ఇండియా–ఆసియాన్ సదస్సులో మోదీ ఇండియా యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఆసియాన్)తో తమ బంధం నానాటికీ బలపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్–ఆసియాన్ మధ్య వ్యూహాత్మక బంధం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. గురువారం 17వ భారత్–ఆసియాన్ వర్చువల్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వివిధ కీలక రంగాల్లో సహకారం కోసం ప్రవేశపెట్టిన నూతన ఆసియాన్–ఇండియా కార్యాచరణ ప్రణాళిక 2021–2025ను శిఖరాగ్ర సదస్సులో నేతలు స్వాగతించారు. కోవిడ్ ఆసియాన్ రెస్పాన్స్ ఫండ్‌కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసియాన్ దేశాలతో భారత్ అనుసంధానం కోసం లైన్ ఆఫ్ క్రెడిట్ కింద బిలియన్ డాలర్లు అందజేయనున్నట్లు తెలిపారు. -
ఆర్థిక బంధం మరింత బలపడాలి...
నేపిడా (మయన్మార్): భారత్-ఆసియాన్ దేశాలు గొప్ప భాగస్వాములుగా ఉండడానికి తగిన అన్ని అవకాశాలూ ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నేపిడాలో జరిగిన 12వ భారత్-ఆసియాన్ సదస్సులో ఆయన బుధవారం హిందీలో ప్రసంగించారు. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య రంగాలకు సంబంధించి భారత్‌లో కొత్త శకం ప్రారంభమైందని ఆసియాన్ దేశాధినేతలకు వివరించారు. ఆయా రంగాల అభివృద్ధిలో పరస్పర సహకారానికి భారత్‌తో భాగస్వాములుగా 10 దేశాల ఆగ్నేయాసియా దేశాల సంఘం- ఆసియాన్ ఉండవచ్చని పేర్కొన్నారు. ఆసియాన్ దేశాలతో భారత్ తన సంబంధాలను పటిష్ట పరచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘వాణిజ్యం, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి మన మధ్య ప్రాచీనకాలం నుంచీ సంబంధాలు ఉన్నాయి’ అన్నారు. ఈ సంబంధాలు ఆధునిక సంబంధాలకు పటిష్ట పునాదులుగా నిలుస్తున్నాయని వివరించారు. భారత్ ‘లుక్ ఈస్ట్ పాలసీ’లో ఆసియాన్‌కు ముఖ్య ప్రాధాన్యత ఉంటుందన్నారు. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’గా దీనిని మోదీ పేర్కొన్నారు. సముద్ర జలాలు, సరిహద్దులకు సంబంధించి అన్ని దేశాలు అంతర్జాతీయ నియమ, నిబంధలను పాటించాలని, ఈ బాధ్యత అన్ని దేశాలపై ఉంటుందని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని ఆగ్నేయాసియా దేశాలు-చైనా మధ్య ఇటీవల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో మోదీ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మలేషియా కంపెనీలకు ఆహ్వానం... భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని మలేషియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. భారత్‌లో వాణిజ్యానికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు ఆయన భారత్-ఆసియాన్ సదస్సులో భాగంగా మయన్మార్ ప్రధాని నజీబ్ రజాక్‌తో ఇంటర్నేషనల్ కన్వెక్షన్ సెంటర్లో సమావేశమయ్యారు. వాణిజ్య, ఆర్థిక సంబంధాల పటిష్టతకు సంబంధించి తమతమ దేశాల్లో పర్యటించాలని పరస్పరం ఇరువురు ప్రధానులూ ఈ సందర్భంగా ఆహ్వానించుకున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ బాగుంది: థాయ్ థాయ్ ప్రధాని ప్రయూత్ ఛోన్-ఓ-ఛాతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఈ ఆలోచన తమ దేశానికీ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. కాగా మోడీ తన పర్యటనలో భాగంగా మయన్మార్ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమ నాయకురాలు అంగ్ సాన్ సూకియాతో కూడా సమావేశమయ్యారు. ఆసియాన్ సదస్సు అనంతరం మోదీ 13న జరగనున్న తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. తరువాత ఈ నెల 15-16 తేదీల్లో ఆస్ట్రేలియాలోని బ్రిస్సేన్‌లో నిర్వహించనున్న జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఈ మూడు సదస్సుల సందర్బంగా ఆయన దాదాపు 40 మందికి పైగా అంతర్జాతీయ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. కాగా జీ-20 సదస్సు సందర్భంగా ఆర్థిక, వాణిజ్య అభివృద్ధికి సంబంధించి మోదీ అత్యద్భుతమైన సూచనలు, సలహాలు అందించగలరన్న విశ్వాసాన్ని ఆస్ట్రేలియా హై కమిషనర్ ప్యాట్రిక్ సుక్లింగ్ న్యూఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


