సమాఖ్య విస్తరణలో చోటు
కౌలాలంపూర్‌లో ఆసియాన్ సమాఖ్య సమావేశాలు ప్రారంభం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు దేశాధి నేతల రాక
కాల్పుల విరమణ పొడిగింపునకు కాంబోడియా– థాయ్‌లాండ్ అంగీకారం
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) సమావేశంలో కీలక పరిణా మాలు చోటు చేసుకు న్నాయి. 1990ల తర్వాత చేపట్టిన మొట్టమొదటి విస్తరణలో సమాఖ్య నూతన సభ్య దేశంగా తూర్పు తీమోర్ చేరింది. కాంబోడియా–థాయ్‌లాండ్‌ల మధ్య కాల్పుల విరమణను మరింతకాలం పొడిగించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సమావేశ వేదికపై ఏర్పాటు చేసిన జెండాల్లో తూర్పు తీమోర్ లేదా తిమోర్ లెస్టీ జెండాను కూడా చేర్చారు.
తమ కల ఇప్పటికి నిజమైందని ఆ దేశ ప్రధానమంత్రి జనానా గుజ్మావో తెలిపారు. అదేవిధంగా, సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో సరిహద్దు సమస్యపై కాల్పుల విరమణను మరికొంతకాలం పొడిగించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై కాంబోడియా– థాయ్‌లాండ్ ప్రధానులు హున్ మనెట్, అనుతిన్ చర్న్‌విరకుల్‌లు సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా బందీలుగా ఉన్న 18 మంది కాంబోడియా సైనికులను థాయ్‌లాండ్ విడిచిపెట్టాల్సి ఉంటుంది.
అదేవిధంగా, సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాలు మోహరించిన భారీ ఆయుధాలను ఉపసంహరించుకుంటాయి. ఒప్పందంలోని అంశాల అమలును పర్యవేక్షించేందుకు ఆసి యాన్ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ ఒప్పందాన్ని సంయుక్త ప్రకటనగా కాంబోడియా, థాయ్ నేతలు పేర్కొనగా ట్రంప్..కౌలాలంపూర్ శాంతి ఒప్పందంగా దీనిని అభివర్ణించారు.
ఈ రెండు దేశాలతోపాటు మలేసియాతోనూ తాము కీలక ఖనిజాలు సహా పలు ఆర్థిక ఒప్పందాలను కుదుర్చుకున్నామని చెప్పారు. ట్రంప్‌తోపాటు చైనా ప్రధాని లీ క్వియాంగ్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జపాన్ నూతన ప్రధాని సనే తకాయిచీ, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా తదితర డజనుకు పైగా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు సాగే ఈ సమావేశాల్లో రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్, చైనాల నుంచి వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో సభ్య దేశాలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది.
ట్రంప్–జిన్‌పింగ్ భేటీకి రంగం సిద్ధం
ఆధునిక సాంకేతికతకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల ఎగుమ తులపై చైనా నిషేధం విధించడం, వాటిని తొలగించకుంటే మరో 100 శాతం టారిఫ్‌లు తప్పవంటూ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక ఉద్రిక్తతలు ఆసియాన్ సమా వేశాల సందర్భంగా సడలిన జాడలు కనిపిస్తున్నాయి. కౌలాలంపూర్ వేదికగా అమెరికా, చైనా ఉన్నత స్థాయి ప్రతినిధులు జరిపిన చర్చల్లో ఒక అంగీకారం కుదిరింది.
చైనా వాణిజ్య ప్రతినిధి లి చెంగాంగ్ మీడియాతో మాట్లాడుతూ..రెండు పక్షాలు వివాదాస్పద అంశాలపై ప్రాథమిక ఏకాభిప్రాయానికి వచ్చాయని, సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా యని పేర్కొన్నారు. రెండు దేశాలు ఒప్పందం వైపు మొగ్గు చూపుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నారు. భవిష్యత్తులో చైనాలో పర్యటించాలనుకుంటున్నానని, అదేవిధంగా జిన్‌పింగ్ ఫ్లోరిడాలోని తన మార్ ఇ లాగో రిసార్టుకు లేదా వాషింగ్టన్‌కు వస్తారని చెప్పారు.


