Photo Credit: Twitter
షార్జా వేదికగా జింబాబ్వే, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే రెండు జట్లు మాత్రం ఈ మ్యాచ్‌లో పరుగుల పండగ చేసుకున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగుల మార్క్ దాటిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ 500 పరుగులను దాటడం విశేషం. చివరిరోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 122.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసింది.
సీనియర్ బ్యాటర్ క్రెయిగ్ ఎర్విన్ (279 బంతుల్లో 206 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీ సాధించాడు అతడి ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా క్రెయిగ్ ఎర్విన్‌కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఎర్విన్ ద్విశతకానికి తోడు ఆల్‌రౌండర్ వెస్లే మెదవరె కూడా శతకం (108 బంతుల్లో 100)తో చెలరేగాడు.
ఆఫ్గన్ బౌలర్లలో జియావుర్ అక్బర్ రెండు వికెట్లు తీయగా, మొహమ్మద్ సలీమ్, అబ్దుల్ మాలిక్ చెరొక వికెట్ పడగొట్టారు. బ్రెండన్ టేలర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఇదే షార్జా వేదికగా నవంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఇక అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రహ్మత్ షా (173), సెదికుల్లా అటల్ (105) సెంచరీలు సాధించారు.
అంతకముందు జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ టేలర్ (131), బ్రాయాన్ బెన్నెట్ (128) శతకాలు చేశారు. ఇక మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన క్రెయిగ్ ఎర్విన్ అరుదైన ఫీట్ సాధించాడు. జింబాబ్వే తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన అతిపెద్ద వయస్కుడిగా క్రెయిగ్ ఎర్విన్ నిలిచాడు. క్రెయిగ్ ఎర్విన్ ప్రస్తుత వయసు 41 ఏళ్ల 82 రోజులు.
ఓవరాల్ జాబితాలో క్రెయిగ్ ఎర్విన్ మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ ఎరిక్ రోవన్ (42 ఏళ్ల 6 రోజులు) 1951లో ఇంగ్లండ్‌తో టెస్టులో 236 పరుగులు సాధించాడు. ఇక రెండో స్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ జాక్ హాబ్స్ 211 పరుగులు (41 ఏళ్ల 195 రోజులు) 1924లో సౌతాఫ్రికాపై, క్రెయిగ్ ఎర్విన్ మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ బ్యాటర్ పాస్తీ హెండ్రెన్ (40 ఏళ్ల 361 రోజులు) 1930లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 205 పరుగులు నాటౌట్ సాధించగా, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ గ్రహం గూచ్ (40 ఏళ్ల 314 రోజులు) న్యూజిలాండ్‌పై 210 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.


