కోహ్లితో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించా! | Kane Williamson Reveals-Conversation-With-Kohli-Before Retirement | Sakshi
Sakshi News home page

కోహ్లితో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించా!

Nov 9 2026 9:09 PM | Updated on Nov 9 2026 9:13 PM

Kane Williamson Reveals-Conversation-With-Kohli-Before Retirement

Photo Credit: Twitter

న్యూజిలాండ్ మాజీ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ తన రిటైర్మెంట్ వెనుక దాగున్న విషయాన్ని పంచుకున్నాడు. ఆటకు వీడ్కోలు పలకడానికి ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో చర్చించినట్లు తెలిపాడు. కోహ్లితో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించినట్లు వెల్లడించాడు. తమ ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ అద్దంలో చూసుకున్నట్టుగా అనిపించిందని పేర్కొన్నాడు. 

'Between the Two Beers' పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విలియమ్సన్ ఈ విషయాలు పేర్కొన్నాడు. కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ‘అండర్-19 రోజుల నుంచీ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. నేను ఎంతో నమ్మే, నాకు చాలా దగ్గరగా ఉండే కొంతమందితో ఈ విషయంపై మాట్లాడాను. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఒక రోజు ముందు విరాట్‌తో కూడా చాలా మంచి సంభాషణ జరిగింది. 

ఇన్నేళ్లుగా క్రికెట్‌లో మేమిద్దరం ఎదుర్కొన్న అనుభవాలను ఒకరితో ఒకరం పంచుకున్నాం. విరాట్‌ను చూస్తే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు అనిపించింది. విరాట్ కూడా తన కెరీర్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోగల వ్యక్తుల్లో విరాట్ ఒకడు. కొన్నిసార్లు సొంత జట్టులోని ఆటగాళ్లు కూడా మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. 

కానీ మా ఇద్దరి ప్రయాణంలో చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరం కెప్టెన్లుగా పనిచేశాం. దాదాపు ఒకే సమయంలో పిల్లలకు తండ్రుల మయ్యాం. మా జీవితాలు రెండు సమాంతర మార్గాల్లో సాగినట్లు అనిపించేది. ప్రపంచాలు వేరైనా మా మధ్య చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

రిటైర్మెంట్ నిర్ణయం గురించి కోహ్లీతో మనసు విప్పి మాట్లాడటం నాకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. మనసులో ఉన్న వ్యక్తిగత విషయాలను, భావోద్వేగాలను ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోగలగడం చాలా గొప్ప విషయం. ఆ సంభాషణ తర్వాత నాకు ఎంతో స్పష్టత వచ్చింది. ఫోన్‌లో మాట్లాడటం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత హోటల్ గదిలోకి నా భార్య వచ్చింది. అప్పుడు నేను ఆమెతో.. ఇక ఇదే సరైన సమయం అని చెప్పాను. ఆ వెంటనే ఆటకు వీడ్కోలు పలికా’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

న్యూజిలాండ్ తరఫున 16 ఏళ్ల పాటు అద్భుతమైన కెరీర్‌ను కొనసాగించిన 35 ఏళ్ల కేన్ విలియమ్సన్, ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16 ఏళ్ల కెరీర్‌లో విలియమ్సన్ 110 టెస్టుల్లో 9,515 పరుగులు, 175 వన్డేల్లో 7,256 పరుగులు, 93 టీ20ల్లో 2,575 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లు కలిపి  48 సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.

ఇదీ చదవండి: కెప్టెన్‌గా రీఎంట్రీ.. ‘ట్రోఫీని ఇంటికి తీసుకొస్తా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement