breaking news
Indian Chess Players
-
టాప్–5లో రౌనక్, హారిక
న్యూయార్క్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఓపెన్ విభాగంలో భారత్ నుంచి 9 మంది గ్రాండ్‌మాస్టర్లు... మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. తొలి రోజు ఓపెన్ విభాగంలో 5 రౌండ్ గేమ్‌లు... మహిళల విభాగంలో 4 రౌండ్ గేమ్‌లు జరిగాయి. ఐదు రౌండ్లు ముగిశాక ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ రౌనక్ సాధ్వాని 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. భారత్‌కే చెందిన ఇరిగేశి అర్జున్ 4 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో, ప్రణవ్ 3.5 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద 3 పాయింట్లతో 56వ ర్యాంక్‌లో, దీప్తాయన్ ఘోష్ 3 పాయింట్లతో 69వ ర్యాంక్‌లో, హర్ష భరతకోటి 2 పాయింట్లతో 108వ ర్యాంక్‌లో, అరవింద్ చిదంబరం 2 పాయింట్లతో 120వ ర్యాంక్‌లో, కార్తీక్ వెంకటరామన్ 1.5 పాయింట్లతో 144వ ర్యాంక్‌లో, 1.5 పాయింట్లతో 156వ ర్యాంక్‌లో ఉన్నారు. ప్లేయర్ల పాయింట్లు సమంగా ఉంటే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరిస్తున్నారు. హెల్గీ గ్రేటర్సన్ (ఐస్లాండ్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), షాంగ్లీ లు (చైనా)లపై గెలిచిన రౌనక్... సామ్యూల్ సెవియన్ (అమెరికా), రే రాబ్సన్ (అమెరికా)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. డేవిడ్ బ్రాడ్స్కయ్ (అమెరికా), విక్టర్ బోలోగన్ (మాల్డొవా), ఫిడేల్ జిమెనెజ్ (అమెరికా), ఎల్తాజ్ సఫార్లీ (అజర్బైజాన్)లపై గెలిచిన అర్జున్... సామ్యూల్ సెవియన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. మహిళల విభాగంలో నాలుగు రౌండ్ల తర్వాత తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఇనా అగ్రెస్ట్ (స్వీడన్), నటాలియా జుకోవా (ఉక్రెయిన్), ఉల్వియా ఫతాలియెవా (అజర్బైజాన్)లపై నెగ్గిన హారిక... టియోడోరా ఇన్జాక్ (సెర్బియా)తో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. భారత్‌కే చెందిన వైశాలి 3 పాయింట్లతో 15వ ర్యాంక్‌లో, వంతిక అగర్వాల్ 2.5 పాయింట్లతో 35వ ర్యాంక్‌లో, కోనేరు హంపి 2.5 పాయింట్లతో 38వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి 2 పాయింట్లతో 57వ ర్యాంక్‌లో, నూతక్కి ప్రియాంక 2 పాయింట్లతో 61వ ర్యాంక్‌లో, దివ్య దేశ్‌ముఖ్ 2 పాయింట్లతో 70వ ర్యాంక్‌లో, పద్మిని రౌత్ 1.5 పాయింట్లతో 78వ ర్యాంక్‌లో ఉన్నారు. -
హంపికి ఐదో స్థానం
షిమ్కెంట్ (కజకిస్తాన్): అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ సంయుక్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీ శుక్రవారం ముగిసింది.హంపి, దివ్య 4.5 పాయింట్ల చొప్పున సంపాదించారు. కాటరీనా లాగ్నో (రష్యా)తో జరిగిన గేమ్‌ను ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి 36 ఎత్తుల్లో.. ఎలిజబెత్ పాట్జ్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌ను దివ్య 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. 7 పాయింట్లతో అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా) ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. టాన్ జోంగి (చైనా; 6.5 పాయింట్లు) రెండో స్థానంలో, బీబీసారా (కజకిస్తాన్; 5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు.