మరొకటి గెలిస్తే చాలు... | India eye series sweep in Hamilton, India vs New Zealand 3rd ODI | Sakshi
Sakshi News home page

మరొకటి గెలిస్తే చాలు...

Nov 10 2026 6:21 AM | Updated on Nov 10 2026 6:21 AM

India eye series sweep in Hamilton, India vs New Zealand 3rd ODI

నేడు న్యూజిలాండ్‌తో భారత్‌ మూడో వన్డే 

నెగ్గితే టీమిండియా ఖాతాలో సిరీస్‌ 

మ్యాచ్‌కు వర్షం ముప్పు!

ఉదయం గం.7:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి మూడు మ్యాచ్‌లు గెలిచి టి20 సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌ అదే తరహాలో ఇప్పుడు వన్డే సిరీస్‌పై కూడా గురి పెట్టింది. గత రెండు మ్యాచ్‌లు నెగ్గి పైచేయి సాధించిన టీమ్‌ మరో విజయాన్ని అందుకొని పరిమిత ఓవర్లలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సై అంటోంది. చివరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండని కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సిరీస్‌ను అందించాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు స్వదేశంలో గత 11 వన్డే సిరీస్‌లు కూడా నెగ్గిన న్యూజిలాండ్‌ ఆ రికార్డు కాపాడుకోవాలని భావిస్తోంది.

హామిల్టన్‌: భారత్, న్యూజిలాండ్‌ మధ్య మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. సెడాన్‌ పార్క్‌ మైదానంలో నేడు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న భారత్‌ మరో విజయాన్ని అందుకొని సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు మెరుగైన ప్రదర్శనతో సిరీస్‌ను కివీస్‌ కాపాడుకోగలదా అనేది ఆసక్తికరం. ఇరు జట్లు కూడా మార్పుల్లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో కివీస్‌కు వన్డే సిరీస్‌ కోల్పోయిన భారత్‌ గెలిస్తే సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది.  

బ్యాటింగ్‌పై దృష్టి... 
తొలి రెండు మ్యాచ్‌లలో భారత్‌కు బౌలింగ్‌ బలంతోనే విజయాలు దక్కాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలో మూడో వన్డేలోనైనా మన బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. గిల్, రోహిత్‌ శర్మ ఒక్కో మ్యాచ్‌లో డకౌట్‌ కావడంతో గత రెండు మ్యాచ్‌లలో సరైన ఆరంభం లభించలేదు. తర్వాతి రెండు వన్డేలకు అందుబాటులో ఉండని గిల్‌ బ్యాటింగ్‌లో సత్తా చాటాలని భావిస్తుండగా... రోహిత్‌ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ కూడా పెద్ద స్కోరు చేయలేదు. 

ఐదో స్థానంలో కేఎల్‌ రాహుల్‌కు బదులుగా అక్షర్‌ను పంపిన ప్రయోగం ఫలించలేదు కాబట్టి వ్యూహం మళ్లీ మారవచ్చు. ఆల్‌రౌండర్‌గా నమన్‌ ధీర్‌ స్థానానికి ఢోకా లేకపోగా, ఏకైక స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌ మెరుగ్గానే ఆడుతున్నాడు. అన్నింటికి మించి నలుగురు పేసర్లు కూడా మంచి ప్రదర్శన ఇస్తుండటం జట్టుకు సానుకూలాంశం. అర్‌‡్షదీప్‌ సింగ్, గుర్నూర్‌ బ్రార్, ఆకిబ్‌ నబీ, అన్షుల్‌ కంబోజ్‌ ఒకరితో మరొకరు పోటీ పడి వికెట్లు తీస్తున్నారు. మైదానంలో అనుకూలంగా పరిస్థితులను వీరు సమర్థంగా ఉపయోగించుకున్నారు. తుది జట్టులో మార్పులకు అవకాశం లేదు కాబట్టి సిరాజ్‌ ఇక టెస్టులకు సిద్ధం కావాల్సిందే.  

గెలిపించేదెవరు!
సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు ఏదీ అనుకూలించడం లేదు. బ్యాటర్లు సమష్టిగా విఫలమవుతుండగా, స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడం సహజంగానే బౌలర్ల వల్ల కావడం లేదు. టి20 సిరీస్‌లో కూడా ఇదే ప్రదర్శనతో తొలి మూడు మ్యాచ్‌లు ఓడి జట్టు సిరీస్‌ కోల్పోయింది. భారత్‌తో పోరుకు ముందు, సిరీస్‌ సమయంలో పలువురు కీలక ఆటగాళ్ల గాయాలు జట్టును బాగా ఇబ్బంది పెట్టాయి. ఈ స్థితిలో కివీస్‌ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో కోలుకొని సిరీస్‌ను ప్రస్తుతానికి ఎలా కాపాడుకుంటుందనేదే ముఖ్యం. 

వన్డే వరల్డ్‌ కప్‌ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే తప్పనిసరిగా రాణించాల్సిన స్థితిలో బ్యాటర్లు యంగ్, సీఫెర్ట్, నికోల్స్, లాథమ్‌ నిలిచారు. ఇలాంటి ఒత్తిడిలోనైనా వీరు బాగా ఆడితే జట్టుకు విజయావకాశం ఉంటుంది. భారత్‌పై ఘనమైన రికార్డు ఉన్న మిచెల్‌ను మినహా ఎవరిపై నమ్మకం ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. ఫిలిప్స్‌ కూడా వన్డేల్లో ప్రభావం చూపలేదు. ఆల్‌రౌండర్‌గా సాంట్నర్‌ ఒంటరి పోరు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. ముగ్గురు పేసర్లు జేమీసన్, డఫీ, స్మిత్‌ ఖాయం కాగా...గాయపడిన టిక్నర్‌కు బదులుగా ‘కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌’గా వచి్చన ఫిషర్‌కు ఈ మ్యాచ్‌లో మరో అవకాశం దక్కవచ్చు.

పిచ్, వాతావరణం 
సీమ్‌కు అనుకూలించే పిచ్‌. పేసర్లు మంచి ప్రభావం చూపించగలరు. గత రెండు మ్యాచ్‌ల తరహాలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టు పిచ్‌ను అంచనా వేయడం కష్టంగా మారింది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవచ్చు. మ్యాచ్‌ రోజున వర్షసూచన ఉంది. ఆటకు అంతరాయం కలగవచ్చు.

తుది జట్లు (అంచనా)
భారత్‌: గిల్‌ (కెపె్టన్‌), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, అక్షర్, నమన్, కంబోజ్, నబీ, అర్‌‡్షదీప్, గుర్నూర్‌.  
న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెపె్టన్‌), యంగ్, సీఫెర్ట్, నికోల్స్, మిచెల్, ఫిలిప్స్, లాథమ్, స్మిత్, జేమీసన్, ఫిషర్, డఫీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement