బతికుండగానే సొంత పెద్దకర్మ.. 900 మందికి విందు! | UPs 80 year-old man organises his own terahvin | Sakshi
Sakshi News home page

బతికుండగానే సొంత పెద్దకర్మ.. 900 మందికి విందు!

Nov 16 2026 10:12 AM | Updated on Nov 16 2026 10:17 AM

UPs 80 year-old man organises his own terahvin

బాగ్‌పత్‌: చనిపోయిన తర్వాత జరగాల్సిన పెద్దకర్మను ఆ వృద్ధుడు బతికుండగానే చేసుకున్నాడు! అంతేకాదు.. ఈ కార్యక్రమానికి ఊరందరినీ పిలిచి విందు భోజనాలు ఏర్పాటు చేశాడు. 80 ఏళ్ల వయసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వృద్ధుడు తీసుకున్న ఈ విచిత్ర నిర్ణయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లా జోహ్రీ గ్రామానికి చెందిన చౌదరి బల్జోర్ సింగ్ (80) ఆదివారం తన పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహించాడు. సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన 13వ రోజున కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కానీ బల్జోర్ సింగ్ మాత్రం తాను బతికుండగానే ఈ సంప్రదాయాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు.

తన మరణానంతరం కుటుంబ సభ్యులు ఏర్పాట్ల కోసం ఇబ్బందులు పడకూడదని, కార్యక్రమ నిర్వహణపై ఎవరూ విమర్శలు చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ‘నా పనిని నేనే చేసుకుంటున్నాను’ అంటూ తన ఆలోచనను వివరించాడు.

ఉదయం పూజలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం సంప్రదాయ పగ్డీ వేడుక నిర్వహించాడు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆయన బాధ్యతలను స్వీకరించే వ్యక్తికి పగ్డీ కట్టడం ఆనవాయితీ. అయితే బల్జోర్ సింగ్ తన సమక్షంలోనే ఈ వేడుకను నిర్వహించి, తన పగ్డీని పదేళ్ల మనవడు ముకుల్‌కు అందజేశాడు. కుటుంబ బాధ్యతలను తదుపరి తరానికి అప్పగించాడు.

ఈ వేడుకకు సుమారు 900 మంది హాజరయ్యారు. పూరీలు, రైతా, రెండు రకాల కూరలు, లడ్డూలతో భారీ విందు ఏర్పాటు చేశారు. బల్జోర్ సింగ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక మనవడు ఉన్నారు. ఆయనకు రెండు కొంత భూమి కూడా ఉంది. ఉత్తరప్రదేశ్ మంత్రి కేపీ మాలిక్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదీ చదవండి: ఇండిగో ఉద్యోగిని అనుమానాస్పద మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement