బద్రీనాథ్: బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూతపడటానికి ముందే ధామ్‌లో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్‌తో పాటు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఆదివారం విపరీతంగా మంచు కురిసింది. దీంతో కొండలన్నీ తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారాయి. మరోవైపు తేలికపాటి వర్షం కూడా కురవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలీ, బాగేశ్వర్, డెహ్రాడూన్, తెహ్రీ, పితోర్‌గఢ్ జిల్లాల్లో 3,000 మీటర్లకు పైగా ఎత్తున్న ప్రాంతాల్లో మోస్తరు వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉంది. మిగిలిన పర్వత ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షం, హిమపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
మరోవైపు నవంబర్ 16 సోమవారం సాయంత్రం బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూతపడనున్న నేపథ్యంలో చివరి దర్శనాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు మంచుతో కప్పుకున్న పర్వతాల అందాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. బద్రీనాథ్ ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు పండిట్ భువన్ చంద్ర ఉన్నియాల్ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం నుంచే ధామ్‌లో మంచు కురవడం ప్రారంభమైందని తెలిపారు. మంచు తెల్లటి దుప్పటిలా బద్రీనాథ్ పట్టణమంతా కప్పేసిందని, దీంతో అక్కడి ప్రకృతి సౌందర్యం మరింత పెరిగిందని చెప్పారు. చమోలీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం నుంచి బద్రీనాథ్‌లో వర్షం, మంచు కురుస్తున్నాయి. ఆలయ ద్వారాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మూతపడనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: ‘అంతా మీరే చేశారు’.. విమానాల అంతరాయంపై ట్రంప్ సర్కార్ వాదన


