కార్ల డిజైన్లపై సంచలన నిర్ణయం! | Foldable Car Screens, Hidden Door Handles : China Vehicle Safety Rules | Sakshi
Sakshi News home page

కార్ల డిజైన్లపై సంచలన నిర్ణయం!

Oct 13 2026 2:17 PM | Updated on Oct 13 2026 2:30 PM

Foldable Car Screens, Hidden Door Handles : China Vehicle Safety Rules

ఆటోమొబైల్ రంగంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆధునిక టెక్నాలజీల జోరుకు చైనా ప్రభుత్వం కళ్లెం వేయనుంది. ప్రయాణికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతాంశంగా మలుస్తూ చైనా కఠినమైన నిబంధనల డ్రాఫ్ట్‌ను తెరపైకి తెచ్చింది. వాహనాల్లో విస్తృతంగా మారుతున్న టెక్నాలజీ వైవిధ్యాలు, డిజైన్ మార్పుల వల్ల భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందన్న ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

మార్గదర్శకాల ముసాయిదాను విడుదల

చైనా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఐఐటీ)తో పాటు మరో మూడు ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఈ కొత్త భద్రతా మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేశాయి. దీని ప్రకారం, కార్లలో ఉపయోగించే ఫోల్డబుల్ (మడిచే వీలున్న), ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేలపై పూర్తి నిషేధం విధించాలని ప్రతిపాదించారు. ఆటోమేకర్లు తమ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు, భారీ డిస్‌ప్లేలు, హెడ్-అప్ డిస్‌ప్లేల పనితీరు, క్రాష్ సేఫ్టీపై పూర్తిస్థాయి మూల్యాంకనం జరపాలని స్పష్టం చేశారు. అలాగే, డ్రైవింగ్ చేసే సమయంలో సీట్లు జీరో-గ్రావిటీ, స్వివెల్ లేదా సీట్-టు-బెడ్ మోడ్‌లలోకి మారకుండా సాంకేతిక నిరోధకాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెడ్‌లైట్లు, వైపర్లు వంటి అత్యవసర ఫీచర్లకు డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లతో పాటు భౌతిక కంట్రోల్స్ (ఫిజికల్ బటన్లు) ఉండాలని నిబంధన తెచ్చారు.

ఇక వాహన డిజైన్‌లో వివాదాస్పదంగా మారిన కనిపించకుండా ఉండే ‘హిడెన్ డోర్ హ్యాండిల్స్' నిషేధానికి ఈ కొత్త నిబంధనలతో మరింత మద్దతు లభించినట్లయింది. కార్ల లోపల, వెలుపల తప్పనిసరిగా మెకానికల్ డోర్ హ్యాండిల్స్ ఉండాలని, అత్యవసర సమయాల్లో లేదా పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మాన్యువల్‌గా తెరుచుకునే వెసులుబాటు కల్పించాలని టెక్నికల్ మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి.

డిజైన్లలో మార్పులు చేస్తారా?

ఈ ముసాయిదాపై ప్రజలు, పరిశ్రమ వర్గాల నుంచి నవంబర్ 10 వరకు సలహాలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నిబంధనలు అమలులోకి వస్తే ఆటోమొబైల్ తయారీదారులు సరికొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ డిజైన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆధునిక హంగుల పేరుతో భద్రతను విస్మరించే కంపెనీలపై చైనా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో సంచలనంగా మారాయి.

ఇదీ చదవండి: బంగారం.. ధరాభారం ఖతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement