అందుకే.. పాత కార్లు కొంటున్నారు! | Used Car Sales Rise Know The Details Here | Sakshi
Sakshi News home page

అందుకే.. పాత కార్లు కొంటున్నారు!

Nov 26 2026 9:42 AM | Updated on Nov 26 2026 9:46 AM

Used Car Sales Rise Know The Details Here

తొలిసారి కొంటున్న వారిలో 56 శాతం మంది సెకండ్స్‌వైపే మొగ్గు

కొత్త కార్ల ధరలు పెరగడమే కారణం

రూ.4 లక్షల కోట్లు దాటిన పాత కార్ల మార్కెట్‌ విలువ

గతేడాది  60 లక్షల కార్ల అమ్మకాలు

పాత ద్విచక్రవాహనాలకూ డిమాండ్‌

కారు ఉండడం ఒకప్పుడు స్టేట­స్‌ సింబల్‌. కానీ రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిన నేటి రోజుల్లో అది ఒక అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా ఒక మధ్యతరగతి కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. దీంతో చాలామంది సొంత కారు కొనాలనే ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఆకాశాన్నంటుతున్న ధరల వల్ల కొత్త కారు కొనడం వారికి తలకుమించిన భారమవుతోంది. అందుకే చాలామంది సెకండ్‌ హ్యాండ్‌ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఆర్థిక స్తోమత ఉన్నవారూ ముందు పాత కార్లు కొని కొంత కాలం వాడిన తర్వాతే కొత్త కార్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు.  దీంతో దేశంలో పాత కార్ల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ప్రతి మూడు కొత్త కార్లు అమ్ముడవుతున్న సమయంలోనే నాలుగు పాత కార్ల విక్రయాలు జరుగుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.   ముఖ్యంగా తొలిసారి కారు కొనుగోలు చేస్తున్న వారిలో 56 శాతం మంది పాత కార్లకే ప్రాధాన్యమిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 46 లక్షల కొత్తకార్లు అమ్ముడయితే ఇదే సమయంలో 60 లక్షల పాతకార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం దేశీయ పాతకార్ల మార్కెట్‌ విలువ రూ.4 లక్షల కోట్లు దాటిందని ఆటోమొబైల్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే మూడేళ్లలో పాత కార్ల అమ్మకాలు ఏడాదికి 90 లక్షల నుంచి కోటికి చేరుతుందని అంచనా వేస్తున్నాయి.

ఎందుకంత మోజంటే..
ముడిసరుకుల ధరల పేరుతో కార్ల తయారీ సంస్థలు ఇష్టమొచ్చినట్లు కొత్త కార్ల ధరలను పెంచుతుండటంతో పాతకార్ల అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. గడిచిన  ఏడాది కాలంలో ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ సంస్థలన్నీ దాదాపు నాలుగుసార్లు కార్ల ధరలను పెంచాయి. దీంతో మోడల్‌ను బట్టి ప్రతీ కారు ధర రెండు నుంచి మూడు శాతం పైన పెరిగాయి. ఇదే సమయంలో కొత్త కార్ల ధరల కంటే పాత కార్లు 25 నుంచి 30 శాతం తక్కువ ధరకు లభిస్తుండటంతో తొలిసారి కొనుగోలు చేసేవారు వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఐదేళ్లలోపు వాడి అమ్మేసే హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు అత్యధికంగా డిమాండ్‌ ఉందని యూజ్డ్‌ కార్ల డీలర్లు పేర్కొంటున్నారు. ఈ మార్కెట్‌కు డిమాండ్‌ బాగా పెరుగుతుండటంతో ఆటోమొబైల్‌ తయారీ సంస్థలే యూజ్డ్‌ కార్ల అమ్మకాల కోసం ఫస్ట్‌ ఛాయిస్, ట్రూవేల్యూ వంటి పేర్లతో ప్రత్యేక షోరూంలను ఏర్పాటు చేయడమే కాకుండా వీటికి కూడా రుణ సౌకర్యాలను అందిస్తున్నాయి.

ద్విచక్రవాహన రంగానిదీ అదే పరిస్థితి..
కేవలం కార్లే కాకుండా ద్విచక్రవాహన రంగంలోనూ యూజ్డ్‌ బైక్‌లు, స్కూటర్లకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం రూ.లక్ష పెట్టందే  ఏ కొత్త బైక్‌ కొనలేని పరిస్థితి. దీంతో అత్యవసరమైనవారు అత్యధికంగా పాత బైక్‌లు, స్కూటర్లవైపే మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సెకండ్‌ హ్యాండ్‌ ఆటోమొబైల్‌ అమ్మకాల్లో 40 శాతం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదశ్‌ వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి పట్టణాల్లో సెకండ్‌హ్యాండ్‌ వాహనాల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆటోమొబైల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement