భారతదేశంలో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారిపై.. మరోసారి ధరల భారం పడనుంది. దేశీయ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో మరో విడత ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే.. మారుతి సుజుకి ధరలను పెంచగా, తాజాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కూడా డిసెంబర్ 1, 2026 నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మరోవైపు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా జనవరి 1, 2027 నుంచి ధరలను పెంచనుంది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్.. తన మొత్తం కార్ల విభాగంలో గరిష్ఠంగా 0.5 శాతం వరకు ధరలను పెంచనుంది. ఈ పెంపు పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా వర్తించనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే.. ఏ మోడల్‌పై ఎంత ధర పెరుగుతుందనే పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా.. తన ఎంపిక చేసిన కార్ల మోడళ్లు, వేరియంట్ల ధరలను డిసెంబర్ 1 నుంచి పెంచనుంది. గరిష్ఠంగా రూ.8,000 వరకు ధరలు పెరగవచ్చని కంపెనీ ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులను ఇప్పటివరకు అంతర్గత సామర్థ్యం, ఖర్చుల నియంత్రణ ద్వారా భరించామని, అయితే ఇప్పుడు కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని హ్యుందాయ్ వెల్లడించింది. అయితే ఏయే మోడళ్ల ధరలు పెరుగుతాయనే వివరాలను ఇంకా ప్రకటించలేదు.
ఇక లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా విషయానికి వస్తే.. ఈ కంపెనీ కూడా ధరల పెంపునకు సిద్ధమైంది. జనవరి 1, 2027 నుంచి తన కార్ల మొత్తం శ్రేణిపై గరిష్ఠంగా 2 శాతం వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను అధిగమించడంతో పాటు వ్యాపార స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. గతంలో ఏప్రిల్ 2026లో కూడా ఆడి గరిష్ఠంగా 2 శాతం వరకు ధరలను పెంచింది. అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది రెండో ధరల పెంపు కానుంది.


