టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో మెకాలి గాయానికి గురైన బుమ్రా ఇంకా కోలుకోలేదు. దీంతో శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు కూడా బుమ్రా దూరమయ్యాడు. తొలుత లంకతో సిరీస్ ఆరంభ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని సెలక్టర్లు అంచనా వేశారు.
కానీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాకపోవడంతో అతడిని లంక టూర్‌ను నుంచి సెలక్టర్లు తప్పించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ నిర్వహణలో టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తిగా విఫలమైందని అతడు మండిపడ్డాడు.
కాగా గతేడాది ఆరంభంలో వెన్ను గాయం బారిన పడినప్పటికి నుంచి బుమ్రా వర్క్‌లోడ్‌ను బీసీసీఐ పర్యవేక్షిస్తునే ఉంది. కీలక మ్యాచ్‌లలోనూ అతడు ఆడుతూ వస్తున్నాడు. మిగిలిన మ్యాచ్‌లకు సెలక్షన్ కమిటీ బుమ్రాకు విశ్రాంతి ఇస్తోంది. అయినప్పటికి ఆశించిన ఫలితాలు రావడం లేదు.
"బుమ్రా వర్క్‌లోడ్ విషయంలో ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధం లేని విషయం. సీఓఈ కేవలం ఆటగాడి ఫిట్‌నెస్ స్థితిపై సమాచారం మాత్రమే ఇస్తుంది. ఏ మ్యాచ్‌లు ఆడాలి, ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలనేది కెప్టెన్, కోచ్, సెలెక్టర్లే నిర్ణయిస్తారు" అని బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
అదేవిధంగా బుమ్రాతో పాటు జట్టులోని పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంపై కూడా బద్రీనాథ్ ఆందోళన వ్యక్తం చేశాడు. "జట్టులో ఇంతమంది ఆటగాళ్ల గాయాలకు గల స్పష్టమైన కారణాలైతే నాకు తెలియదు. కానీ క్రికెట్ వంటి ప్రొఫెషనల్ క్రీడల్లో గాయాలు తప్పవు. వాటిని పూర్తిగా నియంత్రించలేం. అయితే సరైన మేనేజ్‌మెంట్, నిరంతర పర్యవేక్షణ చాలా అవసరమని " అతడు అన్నాడు.


