ఆ పోటీ నుంచి తప్పుకొంటున్నా.. కారణం ఇదే! | Pakistan Javelin Star Arshad Nadeem Skips Lausanne Diamond League for Overseas Training | Sakshi
Sakshi News home page

పోటీలో పాల్గొనను: పాక్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ కీలక నిర్ణయం

Aug 13 2026 11:59 AM | Updated on Aug 13 2026 12:17 PM

Pakistan Arshad Nadeem decided skip Diamond League meet Lausanne Why

నీరజ్‌తో అర్షద్‌ (ఫైల్‌ ఫొటో PC: X)

పాకిస్తాన్‌ స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. డైమండ్‌ లీగ్‌లో భాగంగా లుసానేలో జరుగనున్న ఈవెంట్‌ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని అర్షద్‌ నదీమ్‌ కోచ్‌ సల్మాన్‌ బట్‌ ధ్రువీకరించాడు.

పసిడితో మెరిసి.. ఆపై
కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో అర్షద్‌ నదీమ్‌ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. అత్యుత్తమంగా ఈటెను 92.7 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు.. విశ్వ క్రీడల వ్యక్తిగత విభాగంలో పాకిస్తాన్‌కు తొలి పసిడి పతకం అందించాడు.

కానీ ఆ తర్వాత అర్షద్‌ నదీమ్‌ ప్రదర్శన దిగజారిపోయింది. చివరగా టోక్యోలో జరిగిన వరల్డ్‌కప్‌ చాంపియన్స్‌ మెడల్‌ ఈవెంట్లో ఈటెను 82.75 మీటర్ల దూరం విసిరిన ఈ పాక్‌ అథ్లెట్‌.. ఆ తర్వాత కనీసం 80 మీటర్ల మార్కు కూడా దాటలేదు.

కాంస్యం కూడా గెలవలేక
ఇటీవల కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్షద్‌ నదీమ్‌.. కనీసం కాంస్యం కూడా గెలవలేక అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అయితే, సరైన ప్రాక్టీస్‌ లేకపోవడం, పాక్‌ అమెచూర్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌తో విభేదాల నేపథ్యంలోనే అర్షద్‌ రాణించలేకపోయాడనే వార్తలు వచ్చాయి.

మరోవైపు.. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో తన ప్రదర్శనపై సొంత దేశ అభిమానులు సైతం విద్వేషం వెళ్లగక్కడంతో అర్షద్‌ నదీమ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌కు ఒలింపిక్‌ పతకంతో పాటు మరెన్నో మెడల్స్‌ అందించానని.. తనను తిట్టడం సరికాదని వాపోయాడు. లాహోర్‌ వాతావరణానికి, క్రీడలు జరిగిన గ్లాస్గో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుందని.. అది తన ప్రదర్శనపై ప్రభావం చూపిందని చెప్పకనే చెప్పాడు.

తప్పుకోవడానికి కారణం ఇదే
ఈ నేపథ్యంలో లుసానే (స్విట్జర్లాండ్‌)లో జరిగే డైమండ్‌ లీగ్‌ అంచె పోటీల నుంచి అర్షద్‌ నదీమ్‌ తప్పుకోవడం గమనార్హం. ఈ విషయం గురించి అతడి కోచ్‌ సల్మాన్‌ బట్‌ స్పందిస్తూ.. ‘లుసానేలో జరిగే డైమండ్‌ లీగ్‌లో పాల్గొనవద్దని అర్షద్‌ నిర్ణయించుకున్నాడు. ఆసియా క్రీడలకు సన్నద్ధమయ్యే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు’’ అని స్పష్టం చేశాడు.

అదే విధంగా.. అర్షద్‌ ఈసారి సౌతాఫ్రికాలో ప్రాక్టీస్‌ చేస్తాడన్న సల్మాన్‌ బట్‌.. వీసా రాగానే అతడు అక్కడికి చేరుకుంటాడని తెలిపాడు. పోచెస్ట్రూమ్‌లో రెండు వారాల పాటు అర్షద్‌ శిక్షణ తీసుకుంటాడని తెలిపాడు. కాగా 2022 కామన్‌వెల్త్‌ క్రీడలు, 2024 ఒలింపిక్స్‌కు ముందు అర్షద్‌ ఇక్కడే ప్రాక్టీస్‌ చేశాడు. ఈ రెండు ఈవెంట్లలోనూ అతడు స్వర్ణ పతకం గెలవడం విశేషం.

చాంపియన్లంతా బరిలోనే
ఇదిలా ఉంటే.. ఆగష్టు 21న జరిగే లుసానే డైమండ్‌ లీగ్‌లో భారత స్టార్‌, టోక్యో  ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత నీరజ్‌ చోప్రా, 2016 ఒలింపిక్‌ చాంపియన్‌ థామస్‌ రోలర్‌ (జర్మనీ), 2012 లండన్‌ ఒలింపిక్స్‌ విజేత, ట్రినిడాడ్‌కు చెందిన కెషోర్న్‌ వాల్కాట్‌, వరల్డ్‌ చాంపియన్‌ ఆండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 స్వర్ణ విజేత, శ్రీలంక స్టార్‌ రుమేశ్‌ పతిరగే పోటీపడనున్నారు.

చదవండి: నాడు పావురాల రెట్టలతో పోయిన పరువు.. తాజా పరిణామంపై సింధు స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement