PC: BCCI/CA
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడి ఆటకు తాను ఫిదా అయ్యానని.. అతడు కేవలం పొట్టి ఫార్మాట్‌కే పరిమితం కాబోడని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా వైభవ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఆరంభంలో విఫలమైనా..
ఈ సిరీస్‌లో వైభవ్ (13,15,14) విఫలమైనప్పటికీ.. జింబాబ్వే గడ్డ మీద అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా టీ20 సిరీస్‌లో జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. ఈస్ట్ జోన్ జట్టుకు అతడు ఏకంగా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. మాథ్యూ హెడెన్ తాజాగా స్పందించాడు.
ఫిట్‌గా ఉండటం ముఖ్యం
ANIతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది వైభవ్ కేవలం పొట్టి ఫార్మాట్ ప్లేయర్ మాత్రమే అని అంటున్నారు. నేనైతే ఆ విషయాన్ని అంగీకరించను. సంప్రదాయ ఫార్మాట్‌లోనూ అదరగొట్టగల సత్తా అతడికి ఉంది. అయితే, ఇందుకు వైభవ్ ఫిట్‌గా ఉండటం ముఖ్యం.
అంతకంటే ముందు.. మానసికంగా అతడు మరింత దృఢంగా మారాలి. ఏదేమైనా పదిహేనేళ్ల వయసులోనే అతడు అద్భుతమైన ఆట తీరుతో తనను తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ వంటి బ్లాక్‌బస్టర్ టోర్నమెంట్లో కేవలం పాల్గొనడమే కాకుండా.. ఏకంగా సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగానూ నిలిచాడు. దీనిని బట్టి వైభవ్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
వరల్డ్‌క్లాస్ ప్లేయర్‌గా ఎదుగుతాడు
అతడు కచ్చితంగా వరల్డ్‌క్లాస్ ప్లేయర్‌గా ఎదుగుతాడు. అయితే, వైభవ్ ఆట తీరును మరింత మెరుగపరచుకోవాల్సి ఉంటుంది. అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని ఎలా ఉపయోగిస్తాడన్నదే ముఖ్యం’’ అని మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్.. 776 పరుగులు చేశాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
చదవండి: నాడు పావురాల రెట్టల వల్ల పోయిన పరువు.. తాజా పరిణామంపై సింధు స్పందన


