ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ల శతక హోరు | Atal, Zadran tons help Afghanistan secure series win over Ireland | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ల శతక హోరు

Aug 13 2026 7:51 AM | Updated on Aug 13 2026 7:51 AM

Atal, Zadran tons help Afghanistan secure series win over Ireland

బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సెదికుల్లా అటల్, ఇబ్రహీం జద్రాన్ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించిన ఆఫ్ఘన్.. ఆ తర్వాత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో ఐర్లాండ్‌ను కట్టడి చేసింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ 3-0తో కైవసం చేసుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్‌ ఆరంభంలోనే రహ్మానుల్లా గుర్బాజ్ 12 పరుగులకే ఔటవడంతో ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇబ్రహీం జద్రాన్, సెదికుల్లా అటల్ రెండో వికెట్‌కు ఏకంగా 231 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టుకు భారీ స్కోర్‌ అందించారు.

ఇబ్రహీం జద్రాన్ 114 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 118 బంతుల్లో 107 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు అటల్ మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 98 బంతుల్లో శతకం పూర్తి చేసిన అతడు.. 120 బంతుల్లో 143 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

అటల్, జద్రాన్ శతక్కొట్టుడుతో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో బైరన్ మెక్‌డొనఫ్ మూడు, మార్క్ అడైర్ రెండు వికెట్లు తీశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు పాల్ స్టిర్లింగ్, ఆండీ బాల్బిర్నీ తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. స్టిర్లింగ్ 27 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత బాల్బిర్నీ, హ్యారీ టెక్టర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.

బాల్బిర్నీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 119 బంతుల్లో 109 పరుగులు చేశాడు. అతడికి కర్టిస్ క్యాంఫర్ కూడా తోడయ్యాడు. క్యాంఫర్ కేవలం 46 బంతుల్లోనే 84 పరుగులు చేసి ఐర్లాండ్‌కు విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే ఆఫ్ఘన్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ఐర్లాండ్‌పై ఒత్తిడి పెంచారు.

క్యాంఫర్ ఔటైన తర్వాత ఐర్లాండ్ ఛేదన పూర్తిగా గాడి తప్పింది. చివరకు 48 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ తరఫున యామిన్ అహ్మద్‌జాయ్ నాలుగు వికెట్లు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం​ కారణంగా రద్దు కాగా.. ఆఫ్ఘనిస్తాన్‌ వరుసగా మూడు వన్డేల్లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. నామమాత్రపు చివరి వన్డే ఆగస్ట్‌ 14న బెల్‌ఫాస్ట్‌ వేదికగానే జరుగనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement