భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్
ఆగస్టు 17 నుంచి వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌నకు భారత్ మరోసారి అతిథ్యమివ్వడం ఆనందంగా ఉందని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. దేశంలో బ్యాడ్మింటన్ క్రీడను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నాడు. 2009లో భారత్‌లో తొలిసారి హైదరాబాద్ వేదికగా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహించగా... ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో భారత్ 14 పతకాలు సాధించింది. అందులో 2019లో పీవీ సింధు నెగ్గిన పసిడి అత్యుత్తమం. సైనా నెహ్వల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ వంటి ప్రపంచ స్థాయి షట్లర్లను తీర్చిదిద్దిన గోపీచంద్... భారత బ్యాడ్మింటన్ పురోగతి పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
» ఆటగాళ్ల మధ్య పోలిక సరైంది కాదు. మా తరంలో ఆటగాళ్ల ఆలోచనలు, లక్ష్యాలు వేరే విధంగా ఉండేవి. ఇప్పుడు కాలం పూర్తిగా మారింది. అప్పుడు శరీరానికి ఎలాంటి దెబ్బలు తగలకుండా చూసుకుంటూ క్రీడల ద్వారా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ప్రాథమిక ధ్యేయంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. యువత ఆలోచన ధోరణి భిన్నంగా ఉంది. ప్రపంచ చాంపియన్‌గా ఎదగాలి అనే లక్ష్యంతోనే యువ షట్లర్లు రాకెట్ అందుకుంటున్నారు.
» 2009లో హైదరాబాద్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహించినప్పుడు ఈ క్రీడలో భారత్ అప్పుడప్పుడే అడుగులు వేస్తోంది. కానీ ఇప్పుడు 17 ఏళ్లు తిరిగేసరికి మన షట్లర్లు ఎంతో రాటుదేలారు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో మనవాళ్లు 14 పతకాలు సాధించారు.
» గాయత్రి ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నా. తను కామన్వెల్త్ పతకం గెలిచింది. రెండుసార్లు ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. దేశంలో అత్యుత్తమ డబుల్స్ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక తండ్రిగా ఆమె సాధించిన విజయాలు నాకు ఎంతో సంతోషాన్నిస్తున్నాయి. నేను ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా నిలిచాను కాబట్టి ఆమె కూడా అదే సాధించాలని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఆమె సహజ ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది.
» స్వదేశంలో జరగనున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మన బ్యాడ్మింటన్ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్తుంది. తదుపరి తరం చాంపియన్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అందుకు ఇది గొప్ప అవకాశం. దీంతో పాటు చిన్నారులు ఆటపై మక్కువ పెంచుకునేందుకు ఇది సరైన వేదిక.


