ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయాన్ని నిర్ణయించేది కేవలం ప్రతిభ, సన్నద్ధత మాత్రమే కాదు.. ఇంటర్వ్యూ సమయం కూడా కొంత ప్రభావం చూపుతుందని ఓ కెరీర్ కోచ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సైమన్ ఇంగారి అనే కెరీర్ కోచ్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, అభ్యర్థులకు ఇంటర్వ్యూ సమయాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటే ఉదయం 11 గంటల స్లాట్‌ను వీలైనంత వరకు నివారించాలని సూచించారు. అయితే, ఈ అభిప్రాయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఇంగారి అభిప్రాయం ప్రకారం.. ఉదయం 11 గంటల స్లాట్ సాధారణంగా ఆ రోజులో మొదటి రెండు ఇంటర్వ్యూ స్లాట్‌ల తర్వాత వస్తుంది. దీంతో అప్పటికే ఇంటర్వ్యూయర్లు పలువురు అభ్యర్థులను చూసి ఉండటంతో కొత్త అభ్యర్థిని ముందున్న వారితో పోల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే భోజన విరామం సమయం దగ్గరపడుతుండటంతో కొన్నిసార్లు ఇంటర్వ్యూలు త్వరగా ముగించాలనే ఆలోచన కూడా ఇంటర్వ్యూయర్లలో ఉండవచ్చని వివరించారు.
అంతేకాకుండా, ముందుగా షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు ఎక్కువసేపు కొనసాగితే 11 గంటల స్లాట్‌లో ఉన్న అభ్యర్థులకు ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. చివరి నిమిషంలో సమావేశాలు, షెడ్యూల్ మార్పులు వంటి కారణాలతో కూడా ఈ సమయానికి అంతరాయాలు ఎక్కువగా ఏర్పడే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూ బాగా సాగుతున్నప్పటికీ సమయాభావం వల్ల చర్చను కొనసాగించే అవకాశాలు తగ్గిపోవచ్చని, అవసరమైన ఫాలోఅప్ చర్చలు కూడా భోజనం తర్వాతకు వాయిదా పడే అవకాశం ఉంటుందని తెలిపారు.
దీని బదులుగా ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల మధ్య ఇంటర్వ్యూ స్లాట్ లభిస్తే దానిని ఎంచుకోవాలని ఇంగారి సూచించారు. ఆ సమయంలో ఇంటర్వ్యూయర్లు తాజాగా ఉండటంతో పాటు సమావేశాల ఒత్తిడి తక్కువగా ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో ఇంటర్వ్యూ జరిగే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నారు.
అయితే ఈ సూచనపై నెటిజన్లు ఏకీభవించలేదు. ఇంటర్వ్యూలో విజయాన్ని నిర్ణయించేది సమయం కాదని, అభ్యర్థి సన్నద్ధత, నైపుణ్యాలు, కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసమే కీలకమని చాలామంది యూజర్లు వ్యాఖ్యానించారు. కొందరు తాము 11 గంటల స్లాట్‌లోనే ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాలు సాధించామని తెలిపారు. మరోవైపు, ఇంటర్వ్యూలు నిర్వహించే అనుభవం ఉన్న కొందరు రిక్రూటర్లు తమ షెడ్యూల్ బిజీగా ఉండటంతో సమయానికి అంత ప్రాధాన్యం ఇవ్వబోమని వెల్లడించారు.
హెచ్‌ఆర్ నిపుణుల అభిప్రాయం కూడా ఇదే దిశగా ఉంది. ఇంటర్వ్యూ సమయం కొంతమేర ప్రభావం చూపినా, సబ్జెక్ట్ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సంస్థ గురించి అవగాహన, ఆత్మవిశ్వాసం వంటి అంశాలే తుది ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయని వారు చెబుతున్నారు. అందువల్ల ఇంటర్వ్యూ సమయం కంటే, అభ్యర్థి పూర్తి స్థాయిలో సిద్ధమై హాజరవడం విజయానికి మరింత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.
If HR asks you to choose when to be interviewed, don't choose 11:00 AM.
Here's why :— Simons (@Simon_Ingari) June 26, 2026


