తల్లిపాల వారోత్సవాలు
‘మేం మా పెద్దలు ఎలా చెబితే అలా విన్నాం’ అనే మాటలు బాలింత ఉన్న ఇంట్లో తరచూ వినపడుతుంటుంది. పథ్యం నియమాలు పాటించాలంటూ ‘ఈ రకం భోజనం వద్దు’ అనేవారుంటారు. ‘పోషకాలు ఉండే భోజనం తింటేనే బిడ్డకు సరిపడా పాలు లభిస్తాయి’ అని కొందరంటారు. ఏది తింటే బిడ్డకు మంచిదో అర్థం కాక, ఆందోళనకు లోనయ్యే బాలింతలూ ఉంటారు. ఈ తరహా సమస్యలకు పరిష్కారం.. పోషకాహార నిపుణులిచ్చే సూచనలు...
ఆరోగ్యకరమైన తల్లులు ఉంటేనే ముందు తరాలు ఆరోగ్యంగా వర్ధిల్లుతాయి. భారతీయ మహిళకు రోజుకు దాదాపు 1,800 నుండి 2,200 కేలరీలు అవసరం. పాలిచ్చే తల్లులుకు వీటికన్నా రోజుకు 450 నుండి 500 అదనపు కేలరీలు అవసరం. శరీర పరిమాణం, శారీరక శ్రమ, ఎన్నిసార్లు పాలిస్తున్నారు .. అనేదానిని బట్టి ఆహారం తీసుకునే వ్యక్తిగత అవసరాలు మారుతూ ఉంటాయి. అయితే, ఇది కేలరీలను తగ్గించుకునే సమయం కాదు. పాల ఉత్పత్తికి, ప్రసవానంతరం తల్లి కోలుకోవడానికి కూడా తగినంత ఆహారం అవసరం.
ఉదయం వేళలో...
→ ఉదయం నిద్రలేచిన గంటలోపు వేడి వేడి రాగిజావ లేదా సాంబార్, కొబ్బరి చట్నీతో రెండు ఇడ్లీలు తీసుకోవాలి. అరగంట తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియకు మేలు చేస్తుంది
→ అల్పాహారంగా నానబెట్టిన ఐదారు బాదం పప్పులు, రెండు ఖర్జూరాలు, ఒక అంజీర్, చిటికెడు జీలకర్ర వేసిన ఒక చిన్న కప్పు మజ్జిగ తీసుకోవాలి.
మధ్యాహ్నం...
→ అన్నం లేదా రెండు రోటీలు, పప్పు, ఆకుకూరలతో కూర, కప్పు పెరుగు, కొద్దిగా నెయ్యి. మాంసాహారులైతే చేపలు లేదా చికెన్ తీసుకోవచ్చు. వీటి నుంచి ప్రోటీన్ అందుతుంది
→ మధ్యాహ్నపు చిరుతిండికి అరటిపండు, గుప్పెడు వాల్‌నట్‌లు లేదా పెరుగుతో మెంతి పరాఠా లేదా ఒక కప్పు రాగి మాల్ట్ తీసుకోవాలి.
రాత్రి సమయంలో...
→ కూరగాయలతో చేసిన కిచిడీ లేదా పనీర్ కూర లేదా ఏదైనా ఆకుకూరతో రోటీ తినవచ్చు.
→ పడుకునే ముందు చిన్న కప్పు గోరువెచ్చని పాలు. దీనిలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి తాగడం వల్ల శరీర వాపు తగ్గుతుంది. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. క్రమం తప్పని ఈ తరహా భోజనం, పోషకాలు గల చిరుతిళ్లతో రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా, శక్తిని మరింత నిలకడగా ఉంచి పాల సమృద్ధికి తోడ్పడుతుంది.
మరికొన్ని జాగ్రత్తలు...
→ తల్లిపాలలో అధికభాగం నీరే ఉంటుంది. అందుకని శరీరంలో నీటి శాతం తగ్గకూడదు
→ రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగలి. వేడిగా ఉన్నప్పుడు లేదా రాత్రిపూట చెమట పడుతుంటే ఇంకా ఎక్కువ నీళ్లు తాగాలి. బిడ్డకు పాలు పట్టడానికి కూర్చున్న ప్రతీసారి చిన్న కప్పు నీళ్లు తాగడం మంచిది
→ రసం, సాంబార్, పప్పు సూప్, రాగిజావ, తాజా కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీలు పాలిచ్చే తల్లులకు మేలు చేస్తాయి. ఇవి శరీరానికి తేమను అందించడంతో పాటు, జీర్ణక్రియకు సహాయపడే ఐరన్, తగు మసాలాలను కూడా అందిస్తాయి.
→ యూరిన్ లేత పసుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. ముదురు పసుపు రంగులో ఉంటే నీళ్లు మరిన్ని అవసరమని చెప్పే సంకేతం అని గ్రహించాలి.
తగ్గించాల్సినవి...
→ కాఫీ, టీలు తాగడం మానుకోవాలి. వీటిని సేవించే తల్లుల పాలు తాగిన పిల్లలు నిద్రపోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు.
→ పథ్యం భోజనం అని కొంతమంది తల్లులకు నెలల పాటు కారం భోజనం మాత్రమే పెడుతుంటారు. దీని వల్ల తల్లులకే కాదు, బిడ్డకూ తరచూ కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా ఉంటుంది
→ అధికంగాప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన స్నాక్స్ తీసుకోవద్దు. వీటిలో సోడియం, మైదా ఎక్కువ ఉంటాయి. వీటి ద్వారా శరీరానికి ఎలాంటి పోషకాలు లభించవు.
పాలు తక్కువగా వస్తుంటే.. అనేక కారణాలు ఉండవచ్చు, వాటిలో ఆహారం ఒకటి మాత్రమే. బిడ్డ అడిగినప్పుడల్లా, సరిగ్గా పాలు పట్టేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పాలు సరిగా అందడం లేదని ఆందోళనగా ఉంటే, లాక్టేషన్ కన్సల్టెంట్‌తో మాట్లాడవచ్చు.
తల్లిపాలకు ప్రోత్సాహం తప్పనిసరి...
గర్భంతో ఉన్నప్పుడు, ప్రసవానంతరం పాలిచ్చే తల్లులు పోషకాహారం పట్ల తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబాలు తల్లికి మంచి పోషకాహారాన్ని ఇస్తే, వారి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎదుగుతారు. ప్రసవం అయిన వారం రోజుల నుంచి పాలు, గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.. ఇలా ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. ఐరన్, ప్రోటీన్, విటమిన్ సి ఫుడ్‌తీసుకుంటే బిడ్డకు పాలు సమృద్ధిగా లభిస్తాయి.
పని ప్రదేశాలలో ఉన్నా బిడ్డ పాలు తాగేలా తల్లులు అందుబాటులో ఉండాలి. మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా, నిరంతరాయంగా తల్లిపాలు ఇస్తూ ఉండాలి. బిడ్డకు ఐదవ నెల చివరి వారం నుంచి ఉగ్గు లాంటి ఘనాహారం కూడా కొద్ది కొద్దిగా ఇవ్వవచ్చు. బిడ్డకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వచ్చు. పాలు ఇచ్చే తల్లులు రసాయనాలు, రంగులు కలిపినవీ ప్యాకేజ్ చేసిన జంక్‌ఫుడ్ తినకూడదు.
డా. సుజాతా స్టీఫెన్
న్యూట్రిషినిస్ట్


