గేదెలతో ప్రకృతి వ్యవసాయం | Gadde Satish Babu About Traditional Cattle based Farming, Specal Story | Sakshi
Sakshi News home page

గేదెలతో ప్రకృతి వ్యవసాయం

Sep 22 2026 1:34 AM | Updated on Sep 22 2026 1:34 AM

Gadde Satish Babu About Traditional Cattle based Farming, Specal Story

25 ఎకరాల క్షేత్రం.. 26 గేదెల విసర్జితాలతో అనుదినం భూసారం పెంపు

రోజుకో చోట కట్టెయ్యటమే (మంద కట్టటమే)

పాలు తియ్యటం లేదు.. అమ్మటం అంతకన్నా లేదు..

ఏటా 10 గేదెలను అమ్మి ముగ్గురు పనివారికి జీతాలివ్వటం..

వరి, కొబ్బరి సాగుతో లాభార్జిస్తున్న ప్రగతిశీల రైతు

పశువు లేనిదే వ్యవసాయం లేదని మన దేశంలో ముందు తరం రైతులు ఆచరించి చెప్పిన మాట. ఇదే సంప్రదాయ సేద్య పద్ధతిని తాతల నాటి నుంచి వందేళ్లకు పైగా ఆచరిస్తున్న విలక్షణమైన క్షేత్రం ఒకటుంది. అనేక కోణాల్లో ఈ క్షేత్రం రైతులకు చక్కని పాఠాలు చెబుతోంది. 

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు గద్దె సతీష్‌ బాబు వినూత్న సంప్రదాయ సేంద్రియ సేద్యంతో ఆదర్శంగా నిలిచారు. తమ అనువంశిక 25 ఎకరాల భూమిలో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా, కేవలం గేదెల ఆధారిత సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తూ ఆశ్చర్యకరమైన, ఆదర్శవంతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ఈ విలక్షణ క్షేత్రాన్ని మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సహదేవరెడ్డితో పాటు పలువురు శాస్త్రవేత్తల బృందం సందర్శించి ఈ విధానాన్ని ప్రశంసించటం విశేషం.

25 ఎకరాలు.. 26 గేదెలు...
సతీష్‌ బాబు తన 25 ఎకరాల ఫారమ్‌లో 16 ఎకరాల్లో కొబ్బరి తోటను, మిగతా 9 ఎకరాల్లో పశుగ్రాసం, వరి, బొబ్బర, పిల్లిపెసర తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఈ క్షేత్రంలో మొత్తం 26 గేదెలు ఉన్నాయి. విశేషమేమిటంటే.. ఈ గేదెల నుంచి అసలు పాలు పిండరు. పాలన్నీ పూర్తిగా దూడలకే వదులుతారు. దీనివల్ల దూడలు ఆరోగ్యంగా పెరిగి త్వరగా ఎదుగుతాయి. 

ఇక ఈ పశువులను పొలంలో రోజుకో చోట క్రమపద్ధతిలో మారుస్తూ కట్టేస్తుంటారు. దీన్నే ‘మంద కట్టటం’ లేదా ‘పెన్నింగ్‌’ అంటారు. పశువులు రాత్రివేళ పొలంలో వేసే పేడ, మూత్రం ద్వారా పొలానికి కావాల్సిన ఎరువు అంతా సహజంగానే అందుతుంది. దీనివల్ల అదనంగా ఎలాంటి ఎరువులు వేయాల్సిన అవసరమే ఉండదు. పశువులకు పచ్చిగడ్డి కోసం బొబ్బరను కొబ్బరి తోటలో అంతరపంటగా సాగు చేస్తారు.

అధిక దిగుబడులు.. అద్భుతమైన నాణ్యత...
ఈ సంప్రదాయ పద్ధతిలో పండించిన పంటల ద్వారా అసాధారణమైన ఫలితాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పొలంలో పండించిన 75 కిలోల ధాన్యం బస్తా మరపట్టిస్తే, ఏకంగా 62 కిలోల నాణ్యమైన, అసలు నూకలు లేని బియ్యం వస్తున్నాయి. సాధారణంగా ఇతరులు పండించిన అదే రకం ధాన్యం మరపట్టిస్తే 47 కిలోల బియ్యం మాత్రమే వస్తాయని, కానీ ఈ పద్ధతి వల్ల 15 కిలోల అదనంగా బియ్యం దిగుబడి వస్తుందని పరిశీలనలో తేలింది. ఈ నాణ్యమైన సేంద్రియ బియ్యాన్ని కిలో రూ. 100 చొప్పున నేరుగా వినియోగదారులకు విక్రయిస్తూ రైతు సతీష్‌ బాబు రెట్టింపు ఆదాయాన్ని గడిస్తున్నారు.

కొబ్బరి చెట్లకు కూడా ఇదే తరహాలో పశువుల మందను కట్టేస్తుండటం వల్ల చెట్లకు కావాల్సిన సహజ పోషకాలు అందుతున్నాయి. ఫలితంగా కొబ్బరి చెట్టుకు ఏడాదికి సరాసరి 280 కాయల వరకు దిగుబడి వస్తోంది. రైతుకు చక్కటి లాభాలు చేకూరుతోంది.

పశువులే పెట్టుబడి...
ఈ వ్యవసాయ పద్ధతిలో పర్యావరణ ప్రయోజనాలతో పాటు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫారమ్‌లో ఏటా 10 నుంచి 12 గేదె దూడలు పుడతాయి. ఎదిగిన దూడల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతోనే పొలంలో పనిచేసే ముగ్గురు పాలేర్లకు సరిపడా జీతాలు చెల్లిస్తున్నామని సతీష్‌ బాబు తెలిపారు. అంటే, ఎలాంటి అదనపు పెట్టుబడులు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చులు లేకుండానే వ్యవసాయం లాభసాటిగా సాగుతోంది.

‘రసాయనాల అధిక వినియోగంతో నేల తల్లిని, మానవ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్న నేటి రోజుల్లో.. సతీష్‌ బాబు అనుసరిస్తున్న ఈ గేదెల ఆధారిత సంప్రదాయ ప్రకృతి వ్యవసాయం దేశంలోని ప్రతి రైతుకూ గొప్ప మార్గదర్శకంగా నిలుస్తోంది. సేంద్రియ కర్బనం 0.72%కి పెరిగింది. నేల సారాన్ని కాపాడుతూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ, పెట్టుబడి ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవటానికి, మంచి ఆదాయం పొందటానికి ఈ విధానం ఒక అద్భుతమైన మార్గమ’ని డాక్టర్‌ సహదేవరెడ్డి వ్యాఖ్యానించారు.

గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ అవార్డు, ఐఏఆర్‌ఐ ఫెలోషిప్‌ అవార్డు, ఐఐఆర్‌ఐ అవార్డు, ఆసియన్‌ అగ్రిహిస్టరీ ఫౌండేషన్‌ అవార్డు వంటి పురస్కారాలను సతీష్‌ అందుకున్నారు.
 

మా గేదెలే బంగారం 
వ్యవసాయానికి ఆధారం!
కొబ్బరిలో ఎకరానికి 42 ఏళ్ల నాటి 40 చెట్లున్నా ఏడాదికి రూ. 2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. బీపీటీ 5204 వరి సాగులో ఎకరానికి 22–24 బస్తాల ధాన్యం వస్తుంది. వరి ఒకటే పంట. రెండో పంటగా పిల్లిపెసర వేస్తాం. 75 కిలోల ధాన్యం బస్తాకు 62 కిలోలు నూకలేని బియ్యం దిగుబడి వస్తుంది. కిలో రూ.105 నేరుగా ప్రజలకు అమ్ముతున్నా. ఎకరానికి రూ. 90 వేల నికరాదాయం వస్తోంది. 

25 ఎకరాల్లో 26 గేదెలను రోజుకో చోట మండె కట్టటం ద్వారా నేలను సారవంతం చేస్తున్నాం. ఇంకే ఎరువూ వేయట్లేదు. పేడ పురుగుల రంధ్రాల్లోంచి వర్షపు నీరు భూమిలోకి పుష్కలంగా ఇంకుతోంది. రోజుకో చోట పడుకోవటం వల్ల గేదెలకు ఏ జబ్బూ రావట్లేదు. ఏడాదికోసారి 10 గేదెలను ఒకటికి రూ. 1,40,000 చొప్పున అమ్ముతున్నా. బంగారాన్ని మించి గేదెల ధర పెరుగుతోంది. ఈ ఏడాది ధర 40% పెరిగింది. ఇంతకన్నా మంచి వ్యవసాయం మరొకటి ఉందా? ముత్తాత కాలం నుంచే మా కుటుంబం ఈ ‘సింగిల్‌ క్రాప్‌. డబుల్‌ ఇన్‌కం’ వ్యవసాయం చేస్తున్నాం. 
– గద్దె సతీష్‌బాబు 
(99125 11244)
సీనియర్‌ సేంద్రియ రైతు

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement