సాగుబడి
మిద్దెతోట/ పెరటి తోటల్లో పెరిగే మొక్కలకు ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) వాడటం వల్ల మొక్కలు పచ్చగా మారటం, పూలు–పండ్లు ఎక్కువగా పూయటం, వేర్ల ద్వారా పోషకాలు బాగా అందటం వంటి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.
1. ఇందులో ఉండే మెగ్నీషియం మొక్కల్లో క్లోరోఫిల్ (పత్రహరితం) ఉత్పత్తిని పెంచుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారకుండా, ముదురు పచ్చ రంగులో నిగనిగలాడేలా చేస్తుంది.
2. గులాబీలు, మల్లెలు, మందార వంటి పూల మొక్కలకు పువ్వుల సైజు పెరుగుతుంది, రంగు ప్రకాశవంతంగా ఉంటుంది. ఎక్కువ మొగ్గలు వస్తాయి. కొత్త చిగుళ్లు వచ్చేటప్పుడు. మొగ్గ దశలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి మొక్క మొదట్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున చల్లి నీరు పోయాలి లేదా 1 లీటరు నీటిలో 1 టీస్పూన్ కలిపి ఆకులపై స్ప్రే చేయాలి.
3. టమోటా, మిరప, బెండ, వంగ లాంటి కూరగాయల మొక్కలకు మెగ్నీషియం చాలా అవసరం. ఇది పూత రాలుడును తగ్గిస్తుంది. టమోటాలకు వచ్చే ‘బ్లాసమ్ ఎండ్ రాట్’ (కాయ కింద నల్లగా కావటం) సమస్యను నివారిస్తుంది. మొక్క నాటేటప్పుడు గుంతలో 1 టేబుల్ స్పూన్ వేయాలి. పూత దశలో 1 లీటరు నీటికి 1 టీస్పూన్ కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి ఆకులపై స్ప్రే చేయాలి.
4. నిమ్మ, జామ, దానిమ్మ, మామిడి లాంటి పండ్ల చెట్లకు ఆకులు పసుపు రంగులోకి మారకుండా చూస్తుంది. పండ్లు తీపిగా మారడానికి, రసం బాగా ఊరడానికి సహాయపడుతుంది.
5. నేలలో ఉండే నైట్రోజన్, ఫాస్పరస్ వంటి ఇతర ముఖ్య పోషకాలను మొక్కల వేర్లు సులభంగా పీల్చుకోవటానికి మెగ్నీషియం సహాయపడుతుంది.
6. నారును ఒక కుండీ నుంచి మరో కుండీలోకి మార్చినప్పుడు మొక్కలు వాడిపోకుండా, త్వరగా కొత్త మట్టిలో కుదురుకోవటానికి ఇది దోహదపడుతుంది.
7. విత్తనాలు నాటేటప్పుడు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వాడటం వల్ల అవి వేగంగా, బలంగా మొలకెత్తుతాయి.
8. ఒక లీటరు నీటిలో 1 టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ నీటిని నెలకి ఒకసారి మొక్కల ఆకులపై స్ప్రే చేయాలి. ఆకులు నేరుగా మెగ్నీషియంను గ్రహించడం వల్ల త్వరగా ఫలితం కనిపిస్తుంది.
9. కుండీ చుట్టూ ఉన్న మట్టిని కొద్దిగా తవ్వి, మొక్క మొదట్లో కాకుండా కొంచెం దూరంగా ఒక టీస్పూన్ ΄ûడర్‌ను చల్లి, వెంటనే నీరు పోయాలి. ఎప్సమ్ సాల్ట్ త్వరగా కరగకపోతే వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.
10. ఎక్కువ మొత్తంలో వాడితే మట్టిలో కాల్షియం లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. నెలకొక్కసారి మాత్రమే వాడటం మంచిది.
11. ఎప్సమ్ సాల్ట్ కలిపిన నీటిని ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే స్ప్రే చేయాలి.
12. పెద్ద కుండీలు లేదా నేలపై ఉన్న చెట్లకు 2 టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్‌ను సుమారు 4 లీటర్లు నీటిలో కలిపి సంవత్సరానికి 3–4 సార్లు ముఖ్యంగా పూతకు ముందు, కాయ పిందె దశలో వేర్ల దగ్గర పోయాలి.
13. కూరగాయలు, పూల మొక్కలకు కేవలం మట్టిలో వేయటం కంటే, నీటిలో కలిపి ఆకులపై స్ప్రే చేయడం వల్ల మొక్కలు 20% వేగంగా పోషకాలను గ్రహిస్తాయి.
14. కుండీకి కింద నీరు పోయే రంధ్రం సరిగ్గా ఉండాలి. లేకపోతే ఉప్పు మట్టిలోనే పేరుకుపోయి మొక్క చనిపోతుంది. కుండీలోని మట్టి పూర్తిగా ఎండిపోయి ఉన్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేయకూడదు. మట్టిలో కొద్దిగా తేమ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి.
15. ఇప్పుడే మొలిచిన చిన్న నారు లేదా చిన్న కుండీల్లోని మొక్కలకు ఎప్సమ్ సాల్ట్ వాడకూడదు. మొక్క కనీసం 5–6 ఆకులతో నిలదొక్కుకున్నాకే వాడాలి.
- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం. మొబైల్: 94906 02366
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
ఇదీ చదవండి: రైతులకు గుడ్‌న్యూస్.. పొలాల్లో కార్బన్ పెంచితే ఇక నగదు ప్రోత్సాహకం!


