కొత్తదారి
కొందరికి పుస్తకం చదవడం అంటే ‘వామ్మో’ అనుకునేంత భయం. కొందరికి పుస్తకం చదవడం అంటే ‘ఆహా’ అనిపించే అనుభవం. కొన్ని సంవత్సరాల వరకు... అనంతి ఎప్పుడూ పుస్తకం చదివింది లేదు. ఒకసారి మాత్రం చదవాలనిపించి చదివింది. ఇక అంతే... అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె చదివిన పుస్తకాలు ఎన్నో, ఎన్నెన్నో! పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడానికి ‘ది బుక్ షో’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి సక్సెస్ అయిన అనంతి అమెజాన్ పాపులర్ ఛాయిస్ బుక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఎంపికైంది....
రేడియో జాకీగా ప్రయాణం మొదలుపెట్టిన చెన్నైకి చెందిన అనంతి ‘ది బుక్ షో’ అనే యూట్యూబ్ చానల్ వ్యవస్థాపకురాలిగా తన ప్రత్యేకత చాటుకుంది.
‘రేడియో జాకీగా కెరీర్ ప్రారంభంలో ఏదో ఒక విషయంపై మాట్లాడుతూనే ఉన్నాను. ఆ తరువాత దేని గురించి మాట్లాడాలో మాత్రం అర్థం కాలేదు. ఆ సమయంలోనే పుస్తకాలు చదవాలనిపించింది. ఒక్కటొక్కటిగా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. నేను మొదట్లో చదివిన పుస్తకాల్లో కొన్ని... ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, సీక్రెట్, సేపియన్స్’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంది అనంతి.
పుస్తక ప్రియులను పుస్తక పఠన ప్రయాణంలో భాగం చేయడానికి ‘ది బుక్ షో’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించింది.
ఎన్నో పుస్తకాలు!
పుస్తకం పఠనంలో ఉండే మజాను పరిచయం చేయడమే కాకుండా, ఏ పుస్తకం చదివితే బాగుంటుంది అనే విషయంలో సలహాలు ఇస్తుంటుంది అనంతి. తనకు ఆసక్తి కలిగించిన పుస్తకాల గురించి వీడియోలు చేస్తుంటుంది. ఆ వీడియోలలో ఆ వారంలో తాను చదివిన పుస్తకాలు, పేజీల సంఖ్య, పుస్తకం చదవడానికి ఎన్ని రోజులు పట్టింది... మొదలైన వివరాలు చెబుతుంటుంది. ‘మీరు పరిచయం చేసిన పుస్తకాన్ని ఈమధ్యే చదివాను. చాలా బాగుంది’ అని అనంతితో ఎంతోమంది చెబుతుంటారు.
కలల ఇంధనం
రోజుకు కనీసం రెండు గంటల పాటు పుస్తకాలు చదువుతుంది అనంతి. గాలి చేసే శబ్దాలు వింటూనే కిటికీ పక్కన కూర్చొని సూర్యకాంతిలో పుస్తకాలు చదవడం అంటే అనంతికి ఇష్టం.
‘పుస్తక పఠనం అనేది కలలు కనడానికి ఇంధనాన్ని ఇస్తుంది’ అంటున్న అనంతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సైకాలజీ, సెల్ఫ్–హెల్ప్, ఫైనాన్స్, హ్యూమన్ బిహేవియర్... మొదలైన వాటికి సంబంధించి ఎన్నో పుస్తకాలను పరిచయం చేసింది.
చిన్న చిట్కా
కొత్తగా పుస్తకాలు చదవడం మొదలు పెట్టిన వారికి కొన్ని పేజీల తరువాత ఏకాగ్రత నిలుపుకోవడం కష్టంగా అనిపించవచ్చు. వారికి నేను ఒక చిన్న చిట్కా చెబుతాను. తక్కువ సమయంతో, ఉదాహరణకు రోజుకు పదినిమిషాలతో పుస్తకం చదవడం మొదలుపెట్టి ఆ సమయాన్ని మెల్లగా పెంచుకుంటూ వెళ్లండి. పుస్తకాలు చదవడం అలవాటు అయ్యాక మీకు ఇష్టమైన సబ్జెక్ట్ లేదా జానర్‌పై పుస్తకాలు చదవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు.
– అనంతి


