ఎక్కడున్నావ్‌ జానూ! | Two Year Old Gnaneshwari Missing For 100 Days In Tuni East Godavari, Parents Still Await Her Return | Sakshi
Sakshi News home page

ఎక్కడున్నావ్‌ జానూ!

Sep 16 2026 9:18 AM | Updated on Sep 16 2026 10:08 AM

100 Days Tuni Missing Girl Mystery

తూర్పుగోదావరి: నాన్న కోసం వెంట పడి వెళ్లిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి వంద రోజులైంది. కానీ ఇంత వరకు ఆ పాప ఆచూకీ తెలియలేదు. కన్నబిడ్డ వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు సుంకర గణేష్‌  భవాని ఎదురు చూపులు చూస్తున్నారు. తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్‌ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి (జాను), పెంపుడు కుక్క జూన్‌ ఆరో తేదీన ఆయిల్‌పామ్‌ తోటలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అదృశ్యమైన కొద్దిసేపటికే స్థానికులతో కలసి పరిసర ప్రాంతాలు, సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని వెతికినప్పటికీ జాను కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పది రోజులకు పైగా ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫారెస్టు, హనుమాన్‌ బృందాలు, క్యూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్, స్థానిక పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. 

అణువణువూ జల్లెడ 
ఆయిల్‌పామ్‌ తోట, సమీపంలోని అటవీ ప్రాంతం, పరిసర గ్రామాల్లో సైతం ఆయా బృందాలు అణువణువూ గాలించాయి. నైట్‌ విజన్‌ కెమెరాలు, డ్రోన్లు వినియోగించి వెతికాయి. అడవి జంతుల బారిన పడిందేమోన్న కోణంలో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. అటుగా రాకపోకలు సాగించిన అనుమానిత వాహనాలను తనిఖీ చేయడంతో పాటు సమీప సెల్‌ టవర్ల పరిధిలో ఫోన్‌ కాల్స్‌ను విస్తృతంగా పరిశీలించాయి. ఆయా గ్రామాల్లో ఇంటింటా తనిఖీలు నిర్వహించి జాను ఆచూకీ కోసం యతి్నంచాయి.  

ఆ ఆశతో బతుకుతున్నాం 
జాను తుని 06 పేరుతో ఇటీవల యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాం. దానిలో జాను చిన్నప్పటి ఫొటోలు, వీడియోలను ఉంచుతున్నాం. వాటిని చూసి, ఎప్పటికైనా ఇంటికి చేరుతుందన్న ఆశతో బతుకుతున్నాం. ఎవరైనా పాపను తీసుకువెళితే మా బాధను అర్థం చేసుకుని అప్పగించండి. 
– సుంకర భవాని (జ్ఞానేశ్వరి తల్లి)

కుక్క మృతితో నిరాశ 
జానుతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క నాలుగో రోజు ఇంటికి తిరిగి రావడంతో పాప ఆచూకీ లభిస్తుందన్న ఆశలు రేగాయి. కానీ మరుసటి రోజే కుక్క మరణించడంతో దర్యాప్తు బృందాలకు నిరాశే మిగిలింది. చిన్నారి ఆచూకీ తెలియజేస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా పాప ఆచూకీ లభించక పోవడంతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు నిలిపివేశాయి. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు అంతర్గత విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ, హోంమంత్రి, కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించాయి. కొందరు గిరిజన ప్రాంతంలో గాలించడంతో పాటు చిన్నారి ఫొటోతో ఉన్న పోస్టర్లు పంపిణీ చేశారు.  

ఇదీ చదవండి: ‘సిట్‌తో లాభంలేదు.. సీబీఐ దర్యాప్తునకే ఆదేశించండి’


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement