నెలవంకతో జోడీ కట్టిన శుక్రుడు | Crescent Moon Meets Venus In Rare Celestial Spectacle | Sakshi
Sakshi News home page

నెలవంకతో జోడీ కట్టిన శుక్రుడు

Sep 16 2026 6:09 AM | Updated on Sep 16 2026 6:09 AM

Crescent Moon Meets Venus In Rare Celestial Spectacle

సోమవారం రాత్రి 7 గంటల సమయంలో నాగాయలంకలో కనిపించిన ఖగోళ అద్భుతం

ఆకాశంలో అరుదైన దృశ్యం కనువిందు 

కృష్ణా జిల్లాలో కనిపించిన ఖగోళ అద్భుతం

వినాయక చవితి రోజున ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సోమవారం రాత్రి నెలవంక పక్కన శుక్ర గ్రహం (వీనస్‌) ప్రకాశవంతంగా దర్శనమిచ్చింది. చంద్ర, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరగా వచ్చిన ఈ అద్భుత దృశ్యం కృష్ణా జిల్లా మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించి కనువిందు చేసింది. పడమర దిక్కున సూర్యాస్తమయం తర్వాత చంద్రుడికి కుడి పక్కన శుక్ర గ్రహం మెరుస్తూ కనిపించడం ఆకట్టుకుంది. చంద్రుడిపై భూమి వెలుగు (ఎర్త్‌ షైన్‌) ప్రతిబింబించినట్టు కనిపించింది.

ఇలా కనబడటాన్ని ‘లూనార్‌ అకల్టేషన్‌ ఆఫ్‌ వీనస్‌’గా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతారు. భారత్‌ సహా యూరప్‌ మధ్య ప్రాచ్యదేశాల్లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుందని.. ఇలాంటి దృశ్యం మళ్లీ కొన్ని నెలల వరకు కనిపించదని పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం జరిగాక సుమారు రాత్రి 7 గంటల సమయంలో ఆవిష్కృతమైన ఈ కలయిక ఓ గంట తరువాత కనుమరుగైంది. ఈ దృశ్యాన్ని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించగా.. అనేకమంది తమ మొబైల్స్‌లో చిత్రీకరించేందుకు తంటాలు పడ్డారు.
– నాగాయలంక/చిలకలపూడి (మచిలీపట్నం) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement