సంతకాలు దాచిపెట్టి ‘కూన’ కట్టు కథలు! | TDP MLA Kuna Ravi Kumar Fake Certificates Scam | Sakshi
Sakshi News home page

సంతకాలు దాచిపెట్టి ‘కూన’ కట్టు కథలు!

Sep 16 2026 5:28 AM | Updated on Sep 16 2026 5:28 AM

TDP MLA Kuna Ravi Kumar Fake Certificates Scam

ఫారం–2పై అవాస్తవాలు 

ఐదుగురు సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులనే సర్టీఫై చేశానన్న ఎమ్మెల్యే కూన 

వాస్తవంగా ఆయన సర్టీఫై చేసింది 24 మంది సర్టీఫికెట్లు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మెగా డీఎస్సీలో టీచర్లుగా ఎంపిక చేసిన సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారుల సర్టీఫికెట్ల విషయంలో అవాస్తవాలు వండి వార్చేందుకు టీడీపీ ఎమ్మెల్యే, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కూన రవికుమార్‌ కొత్త కథలు తెరపైకి తెచ్చి ఆపసోపాలు పడ్డారు. అయితే నిజాలు దాచలేకపోయారు. తాను పెట్టిన సంతకాలు దాచిపెట్టి మంగళవారం శ్రీకాకుళంలో ప్రెస్‌మీట్‌లో బుకాయించారు. 

మెగా డీఎస్సీలో మాయలకు వింత వివరణలు ఇచ్చారు. విచిత్రమేమిటంటే 2025 మే 16న ఒక్కరోజే 20 మందికిపైగా క్రీడాకారులకు సంబంధించి ఫారం 2 జారీ చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ 24 మంది సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు సంబంధించిన సర్టీఫికెట్లను సర్టీఫై చేసినట్లు ఫారం–2 పత్రాల్లో వెలుగు చూసింది. ఒకేసారి బల్క్లో ఫారం 2పై సంతకాలు పెట్టి జారీ చేశారంటే దాని వెనకున్న కారణమేంటో కూన రవికుమారే చెప్పాలి.    

కూన చెప్పిందిదే..! 
క్రీడాకారుల భవిష్యత్తు పాడవకూడదని సాఫ్ట్‌బాల్‌ నేషనల్‌ ఫెడరేషన్‌.. గతంలో వివాదాస్పదంగా ఉన్న రాష్ట్ర క్రీడా సంఘాన్ని రద్దు చేసింది. తర్వాత జిల్లా, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులంతా జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్‌లో ఉన్న వారందరి నుంచి రాజీనామాలు తీసుకుని వాటిని ఆమోదించి అడ్‌హక్‌ కమిటీని నియమించాలని నేషనల్‌ ఫెడరేషన్‌కు తీర్మానం పంపారు. దాని ఆధారంగా 2025 ఏప్రిల్‌ 30న అడ్‌హాక్‌ కమిటీని నేషనల్‌ ఫెడరేషన్‌ కమిటీ గుర్తించిందని, సర్టిఫికెట్లను వెరిఫై చేసే అధికారం తనకు ఇచ్చిందని కూన రవికుమార్‌ విలేకరులకు చెప్పారు. ఆ తర్వాత జూన్‌ 30వ తేదీన రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికల ద్వారా ఎన్నికయ్యాయని తెలిపారు. తాను కేవలం ఐదుగురికి మాత్రమే సర్టిఫై చేశానని చెప్పుకొచ్చారు.   

వాస్తవానికి జరిగింది ఇదీ..! 
మెగా డీఎస్సీ 2025 నేపథ్యంలో.. రద్దయిన రాష్ట్ర కమిటీ స్థానంలో ముగ్గురు సభ్యులతో అడ్‌హక్‌ కమిటీని నియమించడం, అందులో ఉన్న మిగతా ఇద్దరిని కాదని రాజకీయ నేపథ్యం ఉన్న కూన రవికుమార్‌కు సర్టీఫికెట్లు వెరిఫై చేసే అధికారం ఇవ్వడం గమనార్హం. అది జరిగిన కొన్నాళ్లకే రెగ్యులర్‌ అసోసియేషన్‌ కమిటీ ఎన్నిక కావడం.. దానికి కూన రవికుమార్‌ ప్రెసిడెంట్‌ కావడం విశేషం. దీన్నిబట్టి ఎవరెంత ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు.  

 

కూన రవికుమార్‌ సంతకం పెట్టి జారీ చేసిన ఫారం–2 పత్రం ఇది. జూలై 17న జారీ చేసినట్లు ఉంది. వాస్తవంగా మెగా డీఎస్సీలో ఏ సర్టిఫికెట్‌ అయినా 2025 మే 31లోగా అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత జరిగిన వెరిఫికేషన్‌లో ఆ పత్రాలన్నీ చూపించాలి. కానీ జూలై 17న సంతకం పెట్టిన ఫాం 2ను అప్‌లోడ్‌ చేసేందుకు అనుమతి ఇచ్చేశారు.

 

‘సాక్షి’ చెప్పిందేంటి?.. కూన చెబుతుందేంటి? 
కె.లీలా శివజ్యోతికి చెందిన ఫారం–2లో నేషనల్‌ పార్టీసిపేషన్‌ బదులు సెకండ్‌ ప్లేస్‌ అని రాశారని ‘సాక్షి’ చెబితే... అదంతా తప్పు, తాను నేషనల్‌ పార్టిసిపేషన్‌ అని రాశానని కూన రవికుమార్‌ బుకాయించారు. మరి ఆన్‌లైన్‌లో పెట్టిన ఈ ఫారం 2లో సెకండ్‌ ప్లేస్‌ అని రాసిందెవరో ఆయనే చెప్పాలి.  

 

ఓ క్రీడాకారిణి సాఫ్ట్‌బాల్‌ ఆడారని సర్టీఫై చేస్తూ కూన రవికుమార్‌ ఇచి్చన ఫారం–2 పత్రమిది. ఇందులో కూన రవికుమార్‌ సంతకం కింద పేర్కొన్న హోదాలో స్పష్టంగా ప్రెసిడెంట్‌ అని రాశారు. తనను అడ్‌హక్‌ కమిటీ సభ్యుడిగా నియమించారని కూన రవికుమారే చెబుతున్నారు. మరి ఒక సభ్యుడి హోదాలో సంతకం పెట్టాల్సింది పోయి ప్రెసిడెంట్‌ హోదాలో సంతకం ఎలా పెట్టారో..? 

కూన రవికుమార్‌ సంతకం పెట్టిన ఫారం–2లో కింద నోట్‌ అని పెట్టి ఉంది. దీంట్లో నేషనల్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ లేదా స్టేట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మాత్రమే సర్టీఫై చేయాలని ఉంది. ఒకవేళ నేషనల్‌ ఫెడరేషన్‌ పదవి కూన రవికుమార్‌కే ఇచ్చి ఉంటే.. ఆ నోట్‌లో ఆ విషయాన్ని పేర్కొనాలి కదా.. కానీ అలా లేదు.  

తమ అసోసియేషన్‌ తరఫున తాను కేవలం ఐదు క్రీడాకారుల సర్టిఫికెట్లను మాత్రమే సర్టిఫై చేసి ఫారం–2 ఇచ్చానని ప్రెస్‌మీట్‌ సాక్షిగా కూన రవికుమార్‌ చెప్పారు. కానీ ఆయన 24 మంది సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు సంబంధించిన సర్టిఫికెట్లను సర్టీఫై చేసినట్లు ఫారం–2 పత్రాలు వెలుగు చూశాయి. ఆయన చెప్పింది నిజమా? లేక తాను సంతకం పెట్టిన ఫారం–2 పత్రాలు నిజమా? లేదంటే ఆయన సంతకాలతో ఎవరైనా ఫోర్జరీ చేశారా? అది చెప్పాల్సింది కూన రవికుమారే!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement