● ఇచ్ఛాపురం నియోజకవర్గంలో భూబాగోతం
● హక్కు పత్రాల పేరుతో రైతుల నుంచి వసూళ్లు
● పట్టించుకోని రెవెన్యూ అధికారులు
అవి నిషేధిత భూములే
ఇచ్ఛాపురం మండలం కొఠారీ పంచాయతీలో ఉన్న 22ఏ నిషేధిత భూములే. ఆ భూముల్ని ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తిగానే పరిగణిస్తాం. ఆ భూములు ఎవరి పేరిట జిరాయితీ భూములుగా మార్చడానికి అవకాశం లేదు. వసూళ్ల విషయం మా రెవెన్యూశాఖకు సంబంధం లేదు – ఎన్.వెంకటరావు,
తహసీల్దార్, ఇచ్ఛాపురం మండలం
పేదల ఇళ్లకు కేటాయించాలి
ఇచ్ఛాపురం మండలం కొఠారీ పంచాయతీ పరిధిలో ఉండే 22ఏ నిషేధిత భూమలను కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన వ్యక్తుల ఆధీనంలో ఉండటం దురదృష్టకరం. ఈ భూములపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు పిర్యాధు చేశాం. సమగ్ర విచారణ చేసి మా పంచాయతీలో ఇళ్లులేని నిరుపేదలకు ఆ భూమి కేటాయించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
– దుక్క ధనలక్ష్మి, తాజీ మాజీ సర్పంచ్, కొఠారీ, ఇచ్ఛాపురం మండలం
ఇచ్ఛాపురం రూరల్:
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలను ఇప్పిస్తామని నమ్మించి కొంతమంది కూటమి నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కవిటి మండలంలో కలకలం రేపుతున్నాయి. ఇచ్ఛాపురం మండలం కొఠారీ పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 5.85 ఎకరాల 22ఏ నిషేధిత ప్రభుత్వ భూమిని కవిటి మండలం భైరిపురం గ్రామానికి చెందిన పది మందికి పైగా రైతులు గత కొంతకాలంగా సాగు చేస్తున్నారని, దీనిపై రెవెన్యూ రికార్డులు, పట్టాలు, ఇతర పత్రాలు పరిశీలించి వాస్తవ పరిస్థితులు నిర్థారించాలని కోరుతూ కొఠారీ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ దుక్క ధనలక్ష్మీ గత నెల 15న కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన భైరిపురం గ్రామానికి చెందిన కొంత మంది తెలుగు తమ్ముళ్లు భూములకు హక్కు పత్రాలు ఇప్పిస్తామంటూ చెప్పి రైతులకు మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి సెంటుకు రూ.500 నుంచి రూ.3వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతుల అవసరమే అవకాశంగా..
తమ ఆధీనంలో ఉన్న భూములకు చట్టబద్ధమైన హక్కు పత్రాలు వస్తాయన్న ఆశతో పేద రైతులు అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు మధ్యవర్తులుగా రంగ ప్రవేశం చేసి రెవెన్యూ శాఖాధికారులతో పాటు అధికార ప్రభుత్వానికి చెందిన పెద్దలను మేనేజ్ చేసేందుకు పెద్ద మొత్తంలో అందజేయాలంటూ రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు తమ భూముల సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకంతో డబ్బులు చెల్లించినట్లు చెబుతున్నారు. అయితే హక్కు పత్రాల విషయంలో స్పష్టమైన ఫలితం కనిపించకపోగా అన్యాయంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతుల భూములే లక్ష్యంగా మధ్యవర్తిత్వం సాగిందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల తీరుపై విమర్శలు..
రైతుల నుంచి వస్తున్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూముల హక్కులు, సర్వే నంబర్లు, రికార్డుల విషయంలో అధికార యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తెవాల్సి ఉన్నప్పటికీ ‘మాకేం తెలియదు’ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల వ్యవహారాల్లో మధ్యవర్తుల జోక్యం, రైతుల నుంచి డబ్బుల వసూళ్ల ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపై ఉంది. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
రికార్డులు బయటపెడితే..
కొఠారీ, భైరిపురం ప్రాంతాల్లోని సంబంధిత సర్వే నంబర్లు, పాత భూ పంపిణీ రికార్డులు, ప్రస్తుత సాగుదారు వివరాలు, రెవెన్యూ రికార్డులను అధికారులు బహిర్గతం చేస్తే అసలు వాస్తవం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైతుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి నిజనిజాలు తేల్చాలని, అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


